Namibia vs South Africa: దక్షిణాఫ్రికాకు నమీబియా షాక్.. టీ20లో సంచలన విజయం..!

Namibia vs South Africa: టీ20 ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికాను 18 పరుగుల తేడాతో ఓడించి నమీబియా మరోసారి సంచలనం సృష్టించింది.

Gagan kumar
Published on: 29 Aug 2026 9:33 AM IST
Namibia vs South Africa
X

Namibia vs South Africa: దక్షిణాఫ్రికాకు నమీబియా షాక్.. టీ20లో సంచలన విజయం..!

Namibia vs South Africa: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర పునరావృతమైంది. గతేడాది అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును ఓడించి సంచలనం సృష్టించిన పసికూన నమీబియా, సరిగ్గా 10 నెలల వ్యవధిలోనే మరోసారి అదే అద్భుతాన్ని చేసి చూపించింది. ట్రై సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికాను 18 పరుగుల తేడాతో చిత్తు చేసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ ఫ్రైలింక్ (60) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేయగా, మరొక ఓపెనర్ లారెన్ స్టీన్‌కాంప్ (41) అతనికి చక్కటి సహకారం అందించాడు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (19) మినహా మిగతా బ్యాటర్లు విఫలమైనప్పటికీ, ఈ ఓపెనర్ల భాగస్వామ్యమే నమీబియాకు పోరాడే స్కోరును అందించింది.

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు నమీబియా బౌలర్లు ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. రూబెన్ ట్రంపెల్మాన్, జేజే స్మిత్ తలా 3 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. దక్షిణాఫ్రికా జట్టులో ఏకంగా నలుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా, ముగ్గురు అసలు ఖాతానే తెరవలేకపోయారు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (75) ఒంటరి పోరాటం చేశాడు. మైదానంలో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ నమీబియా బౌలర్లపై ఒత్తిడి పెంచినప్పటికీ, 18వ ఓవర్‌లో ట్రంపెల్మాన్ విసిరిన బంతికి అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. ఆఖర్లో డువాన్ జాన్సెన్ (25 నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 28 పరుగులు అవసరం కాగా, జేజే స్మిత్ అద్భుతమైన బౌలింగ్ వేసాడు. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడంతో నమీబియా 18 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి క్రికెట్ అభిమానులను మరోసారి మురిపించింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story