Nikhil Chaudhary: ఆస్ట్రేలియా జట్టులో భారత ఆటగాడికి చోటు.. తొలి ప్లేయర్‌గా రేర్ రికార్డు!
Nikhil Chaudhary in Australia's T20 Squad: ఆస్ట్రేలియా క్రికెట్‌లో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది.
Nikhil Chaudhary: ఆస్ట్రేలియా జట్టులో భారత ఆటగాడికి చోటు.. తొలి ప్లేయర్‌గా రేర్ రికార్డు!
Nikhil Chaudhary: ఆస్ట్రేలియా క్రికెట్‌లో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. భారతదేశంలో జన్మించిన ఓ క్రికెటర్.. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. ఢిల్లీలో జన్మించిన లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతడిని జట్టులోకి తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ సిరీస్‌కు దూరమవడంతో.. అతని స్థానంలో నిఖిల్ చౌదరికి అవకాశం దక్కింది.
భారత సంతతి క్రికెటర్‌గా చరిత్ర:
ప్రస్తుతం బెల్జియంలో జరుగుతున్న ఈయూటీ20 టోర్నీలో జేబీ బ్రుగ్స్ జట్టుకు నిఖిల్ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. త్వరలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఆస్ట్రేలియా జట్టుతో అతడు కలవనున్నాడు. నిఖిల్ తుది జట్టులో చోటు దక్కించుకుని మైదానంలో అడుగుపెడితే.. 1964 తర్వాత ఆస్ట్రేలియా తరఫున ఆడిన తొలి భారత సంతతి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. చివరిసారిగా భారతదేశంలో జన్మించిన లెగ్‌స్పిన్నర్ రెక్స్ సెల్లర్స్ 1964లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇప్పుడు 62 ఏళ్ల తర్వాత నిఖిల్ ఆసీస్ తరఫున ఆడనున్నాడు.
గిల్, అభిషేక్‌తో కలిసి:
ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి భారత దేశీయ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే అతను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. యువ స్టార్‌లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలతో కలిసి ఆడాడు. అంతేకాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. కరోనా మహమ్మారి సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్న నిఖిల్.. అక్కడే తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఆపై దేశీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో గత సీజన్‌లో 32 మ్యాచులు ఆడిన 693 పరుగులు చేయడమే కాకుండా, తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆ ప్రదర్శన ఆసీస్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
తుది జట్టులో చోటు కోసం పోటీ:
ఆస్ట్రేలియా సెలెక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.. నిఖిల్ చౌదరిపై సెలక్షన్ కమిటీ చాలా కాలంగా నిఘా పెట్టిందని తెలిపారు. అతని బిగ్ బాష్ ప్రదర్శనలు, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉన్న అనుబంధం కారణంగా జాతీయ జట్టులో చోటు కల్పించినట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్ పర్యటనలో అతను తొలి టీ20 మ్యాచ్ నుంచే తుది జట్టులో చోటు కోసం పోటీ పడతాడని చెప్పారు. బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ జూన్ 17న, రెండో మ్యాచ్ జూన్ 19న, మూడో మ్యాచ్ జూన్ 21న నిర్వహించనున్నారు.
భారత సంతతి ఆటగాళ్లకు స్ఫూర్తి:
నిఖిల్ చౌధరీ 1996లో భారత్‌లో జన్మించాడు. పదేళ్ల కిందటే అతడి కుటుంబం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఈ క్రమంలో నిఖిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. 1964 తర్వాత భారత్‌లో జన్మించి ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. భారత మట్టిలో పుట్టి, ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు సంపాదించిన నిఖిల్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఆసక్తికర చర్చగా మారింది. అతను అరంగేట్రం చేస్తే భారత సంతతి ఆటగాళ్లకు మరో స్ఫూర్తిదాయక గాథగా నిలవడం ఖాయం.




