Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి వరుస గాయాలు.. బీసీసీఐ సమావేశంలో వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు!

VVS Laxman opens up on Nitish Kumar Reddy's injuries. నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై సీఓఈ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు.

Rishvik
Published on: 10 Aug 2026 6:40 PM IST
Nitish Kumar Reddy
X

Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి వరుస గాయాలు.. బీసీసీఐ సమావేశంలో వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు!

Nitish Kumar Reddy: టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. తరచూ గాయాల బారిన పడుతున్న నితీశ్.. ఆల్‌రౌండర్‌గా తనపై ఉండే అధిక వర్క్‌లోడ్‌ను మెరుగ్గా ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. గాయాలు క్రీడాకారుల కెరీర్‌లో భాగమేనని, అయితే వాటి నుంచి త్వరగా కోలుకుని ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడం ముఖ్యమని చెప్పాడు. మ్యాచ్‌ల మధ్య లభించే విరామాల్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం ఎంతో అవసరం అని హైదరాబాద్ సొగసరి

ఇటీవల భారత జట్టులో పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా ఫిట్‌నెస్, రిహాబిలిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లి అక్కడి రిహాబిలిటేషన్, ఇంజురీ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలపై వీవీఎస్ లక్ష్మణ్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

టీమిండియాలో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న నితీశ్ కుమార్ రెడ్డికి ఇటీవల కాలంలో గాయాలు ఇబ్బందిగా మారాయి. ఎడమ తొడ క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా అతడు ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉండాలని, ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భావిస్తున్న సమయంలో గాయాలు అతడి అవకాశాలకు అడ్డంకిగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో నితీశ్ గాయాల నిర్వహణపై లక్ష్మణ్‌ను ప్రశ్నించగా.. ఆటగాడి మానసిక స్థితిని కూడా రిహాబిలిటేషన్ ప్రక్రియలో భాగంగా పరిగణిస్తామని చెప్పాడు. 'గాయపడిన ఆటగాడు తన పరిస్థితిని అర్థం చేసుకుని తిరిగి మైదానంలోకి రావడానికి అవసరమైన చర్యలను పాటించాల్సి ఉంటుంది. నితీశ్ ఆల్‌రౌండర్ కావడంతో వర్క్‌లోడ్ ఎక్కువగా ఉంటుంది.

మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలోనే కాకుండా.. టోర్నీల మధ్య లభించే స్వల్ప విరామాలను కూడా ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఆటగాళ్లకు గతంలో మాదిరిగా ప్రత్యేకంగా పెద్ద ఆఫ్‌సీజన్ ఉండటం లేదు. ఐపీఎల్, రాష్ట్ర జట్ల తరఫున క్రికెట్, దేశవాళీ టోర్నీలు, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఇలా వరుసగా ఆడాల్సి వస్తోంది. దీంతో మ్యాచ్‌ల మధ్య లభించే విరామాల్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం మరింత కీలకంగా మారింది' అని లక్షణ్ వివరించాడు

‘గాయాలు ఆటలో భాగమే. అయితే ఆల్‌రౌండర్‌గా తనపై ఉండే వర్క్‌లోడ్‌ను ఎలా మెరుగ్గా నిర్వహించుకోవాలనే విషయంపై నితీశ్‌తో నిరంతరం చర్చిస్తున్నాం. ఇది ఒక్క నితీశ్‌కు మాత్రమే వర్తించే విధానం కాదు. భారత జట్టులోని అందరి ఆటగాళ్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తున్నాము' అని స్పష్టం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లు ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సీజన్ ప్రారంభానికి ముందే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేసేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పలు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ వెల్లడించాడు. కాంట్రాక్ట్ ఆటగాళ్లతో పాటు జాతీయ జట్టుకు లక్ష్యంగా ఉన్న ఆటగాళ్లు కూడా వివిధ ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పాడు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ పరిచయం చేసిన బ్రాంకో టెస్ట్ కూడా ఈ పరీక్షల్లో కొత్తగా చేరిందని లక్ష్మణ్ తెలిపాడు. ఇది కండిషనింగ్ సెషన్‌లా పనిచేయడంతో పాటు ఆటగాడి ఏరోబిక్, అనెరోబిక్ ఫిట్‌నెస్ స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని వివరించాడు. యోయో టెస్ట్ ఆటగాళ్ల శరీరంపై ఎక్కువ ఒత్తిడి పెంచడంతో.. సిరీస్ జరుగుతున్న సమయంలో దానిని నిర్వహించడం కష్టమని లక్ష్మణ్ పేర్కొన్నాడు. యోయో టెస్ట్ తర్వాత కోలుకోవడానికి ఆటగాళ్లకు ఎక్కువ సమయం అవసరమవుతుందని చెప్పాడు.

దీనికి భిన్నంగా బ్రాంకో టెస్ట్‌ను సీజన్‌లో అవసరానికి అనుగుణంగా పునరావృతం చేయవచ్చని లక్ష్మణ్ వివరించాడు. ఇది ఫిట్‌నెస్‌ను పరీక్షించడంతో పాటు కండిషనింగ్ సెషన్‌లా కూడా ఉపయోగపడుతుందని తెలిపాడు. భారత క్రికెట్‌లో వరుసగా గాయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కేవలం సీజన్ ప్రారంభంలోనే కాకుండా ఏడాది పొడవునా పర్యవేక్షించడం అవసరమని లక్ష్మణ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆల్‌రౌండర్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఎక్కువ శ్రమించాల్సి ఉండటంతో వారి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story