ODI World Cup 2027: ఆడొద్దని.. రోహిత్, కోహ్లీని ఒప్పించడం బీసీసీఐకి పెద్ద సవాల్!

BCCI Faces Tough Challenge Over Rohit and Kohli. 2027 వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా భారత జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

Rishvik
Published on: 14 July 2026 6:53 PM IST
ODI World Cup 2027
X

ODI World Cup 2027: ఆడొద్దని.. రోహిత్, కోహ్లీని ఒప్పించడం బీసీసీఐకి పెద్ద సవాల్!

ODI World Cup 2027: వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా భారత జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పటిష్ట జట్టును సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇంకా వన్డే జట్టులో కీలక సభ్యులుగానే కొనసాగుతున్నారు. ఆ ఇద్దరి పనిభారాన్ని నియంత్రించడంతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు రొటేషన్ పాలసీ అమలు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రో-కో వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత జట్టుకు ఆడుతుండటంతో.. వారిని కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవాలని ఒప్పించడం అంత సులభం కాదు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ గత కొంతకాలంగా సీనియర్ ఆటగాళ్లకు రొటేషన్ విధానం అవసరాన్ని వివరిస్తున్నారు. ప్రధాన ఆటగాళ్లకు గాయాలు లేదా ఫామ్ సమస్యలు ఎదురైతే.. ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉండాలన్నదే ఈ వ్యూహం వెనుక ఉద్దేశం. గత నెల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని మేనేజ్‌మెంట్ భావించింది. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. రోహిత్-జైస్వాల్ జోడీని ఓపెనింగ్‌కు పంపాడు.

అయితే అఫ్గానిస్థాన్‌పై మూడు వన్డేల్లో రెండు సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్‌కు ఇంగ్లండ్ పర్యటనలోమాత్రం చోటు దక్కలేదు. అయినప్పటికీ అతను 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో భాగంగానే ఉన్నాడని సమాచారం. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌లను రొటేషన్ పద్ధతిలో ఉపయోగించాలని కూడా టీమ్ మేనేజ్‌మెంట్ గతంలో భావించింది. అలాగే రాహుల్‌కు బ్యాకప్ వికెట్‌ కీపర్‌ను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఒకవేళ ప్రపంచ కప్ సమయంలో ఏదైనా సీనియర్ ఆటగాడు గాయపడితే, అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్రత్యామ్నాయ ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలన్నదే మేనేజ్‌మెంట్ ప్రధాన ఉద్దేశమని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సదరు జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో మాత్రమే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రో-కోలు టెస్టులు, టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వీరికి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా వన్డేల ద్వారానే లభిస్తోంది. అలాంటి పరిస్థితిలో వారిని కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవాలని ఒప్పించడం మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా అనే చెప్పాలి. ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు కూర్పుపై స్పందించాడు. తమ జట్టు పటిష్టంగా ఉందని స్పష్టం చేశాడు.

'ఇంగ్లండ్ సిరీస్‌ల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం చాలా ముఖ్యం. వారు ఒత్తిడిలో ఆడి అనుభవం సంపాదిస్తే ప్రపంచ కప్‌కు అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచ కప్‌లో 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మూడు లేదా ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయి. కాబట్టి యువ ఆటగాళ్లకు ముందుగానే అనుభవం కల్పించడం అవసరం' అని గిల్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ను 2027 వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహంగా భారత్ ఉపయోగించుకోనుంది. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే.. యువ ఆటగాళ్లను కూడా సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ చూస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story