Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం..? ప్లేయర్ల ఫోన్లు స్వాధీనం!

Pakistan Cricket: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెటర్ల మొబైల్ ఫోన్లను పీసీబీ స్వాధీనం చేసుకోవడం మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలకు తావిస్తోంది.

Gagan kumar
Published on: 6 Sept 2026 2:20 PM IST
Pakistan Cricket
X

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం..? ప్లేయర్ల ఫోన్లు స్వాధీనం!

Pakistan Cricket Team: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు ఏడుగురు ఆటగాళ్లను, కోచ్‌ను జట్టు నుంచి తొలగించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు , ఇప్పుడు ఉన్నట్టుండి క్రికెటర్ల మొబైల్ ఫోన్లను తమ స్వాధీనంలోకి తీసుకోవడం క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతోంది. పీసీబీ తీసుకుంటున్న ఈ వింత నిర్ణయాల వెనుక ఏమైనా పెద్ద అవినీతి లేదా మ్యాచ్ ఫిక్సింగ్ కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అంబర్ అలీ ఈ వివాదాస్పద అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టు ముగిసే వరకు ఆటగాళ్ల ఫోన్లు బోర్డు వద్దే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అందరి ఫోన్లు జప్తు చేశారా లేక కొందరి ఫోన్లనే స్వాధీనం చేసుకున్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ సంచలన పరిణామంపై పీసీబీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది.

సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో డ్రెస్సింగ్ రూమ్, మైదానం పరిసరాల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఐసీసీ కఠిన ఆంక్షలు విధిస్తుంది. మ్యాచ్ సమయంలో సమాచార మార్పిడిని నిరోధించి, ఫిక్సింగ్ ఆస్కారం లేకుండా చూడటమే ఐసీసీ యాంటీ కరప్షన్ నిబంధనల ముఖ్య ఉద్దేశం. కానీ, మ్యాచ్ లేని సాధారణ రోజుల్లో ,ప్రాక్టీస్ సమయంలో కూడా ఆటగాళ్ల వ్యక్తిగత ఫోన్లను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ఐసీసీ సాధారణ నిబంధనల పరిధిలోకి రాదు.

ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ ప్రకారం.. విచారణకు అవసరమైన సమాచారం లేదా ఆధారాలు ఒక ఫోన్‌లో ఉన్నాయని అనుమానించడానికి తగిన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే అధికారులు లిఖితపూర్వక ఆదేశాలతో పరికరాలను జప్తు చేస్తారు. ఇప్పుడు పీసీబీ కూడా అదే రీతిలో వ్యవహరించడం చూస్తుంటే, జట్టులో ఏదో తీవ్రమైన అవినీతి లేదా ఫిక్సింగ్ వ్యవహారంపై రహస్యంగా విచారణ జరుపుతున్నారా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. గతంలోనూ పలుమార్లు ఫిక్సింగ్ వివాదాల్లో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెట్‌కు ఈ కొత్త పరిణామం మరో పెద్ద మచ్చగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story