Video: మరోసారి పరువు తీసుకున్న పాక్ టీం.. ఈ కామెడీ రనౌట్ చూస్తే నవ్వులే!

Video: లీడ్స్ లోని హెడింగ్లే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ నవ్వుల విందు చోటుచేసుకుంది.

Venkat
Published on: 25 Jun 2026 10:27 AM IST
Video
X

Video: మరోసారి పరువు తీసుకున్న పాక్ టీం.. ఈ కామెడీ రనౌట్ చూస్తే నవ్వులే!

Pakistan women cricket: క్రికెట్ మైదానంలో విచిత్రమైన రనౌట్లు, నవ్వు తెప్పించే ఫీల్డింగ్ తప్పిదాలకు పాకిస్తాన్ జట్టు పెట్టింది పేరు. ఆ సంప్రదాయాన్ని పురుషుల జట్టే కాదు, మేమూ కొనసాగిస్తామంటూ పాకిస్తాన్ మహిళా జట్టు ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా మరోసారి నిరూపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు పాక్ ఓపెనర్ల మధ్య జరిగిన ఓ ఘోర తప్పిదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పిచ్ మధ్యలో కామెడీ సర్కస్.. ఏం జరిగిందంటే?

లీడ్స్ లోని హెడింగ్లే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ నవ్వుల విందు చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఈ ఘోరం జరిగింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కిమ్ గార్త్ వేసిన వైడ్ బాల్‌ను వికెట్ కీపర్ బెత్ మూనీ సరిగ్గా అందుకోలేకపోయింది. బంతి చేజారడాన్ని గమనించిన పాక్ ఓపెనర్లు మునీబా అలీ, గుల్ ఫెరోజా పరుగు కోసం పిచ్ మధ్యలోకి దూసుకొచ్చారు.

అయితే, సగ దూరం వచ్చాక ఇద్దరిలోనూ ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. వెనక్కి వెళ్లాలో, ముందుకు రావాలో తెలియక ఇద్దరూ పిచ్ మధ్యలోనే ఆగిపోయారు. ఈ లోగా చురుగ్గా కదిలిన ఆస్ట్రేలియా ఫీల్డర్ జార్జియా వోల్ బంతిని అందుకుని బౌలర్ కిమ్ గార్త్ వైపు విసిరింది. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గుల్ ఫెరోజా తన క్రీజులోకి చేరకముందే గార్త్ వికెట్లను పడగొట్టింది. దీంతో గుల్ ఫెరోజా అత్యంత దారుణమైన రీతిలో రనౌట్ అయి వెనుదిరగాల్సి వచ్చింది. మునీబా అలీ తన వికెట్ కాపాడుకోవడానికి తోటి ఆటగాడిని బలి ఇచ్చిందంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

పురుషుల జట్టును గుర్తుచేసిన వైనం..

పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు గతంలో ఇంజమామ్ ఉల్ హక్ కాలం నుంచి మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ ల వరకు ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక కామెడీ రనౌట్లను అభిమానులకు పరిచయం చేసింది. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే బాటలో పయనించడం గమనార్హం. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన ఆతిఫ్ నవాజ్ సైతం ఈ రనౌట్ చూసి తీవ్ర అసహనానికి గురయ్యాడు. "నా గొంతులోనే ఎంత నిరాశ ఉందో మీరు వినవచ్చు" అంటూ అతను సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు.

పేకమేడలా కూలిన పాక్ బ్యాటింగ్..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి ఎల్లీస్ పెర్రీ (71 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో పాకిస్తాన్ జట్టు కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మునీబా అలీ ఒంటరి పోరాటం చేస్తూ 32 పరుగులు చేయగా, కెప్టెన్ ఫాతిమా సన, ఇరామ్ జావేద్ మాత్రమే రెండంకెల స్కోరు దాటగలిగారు. ఏకంగా నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ మోలిన్యుక్స్, అన్నాబెల్ సదర్లాండ్, ఎల్లీస్ పెర్రీ తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బతీశారు.

ఈ ఓటమితో 2026 మహిళా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలు చవిచూసిన పాక్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. జూన్ 27న బ్రిస్టల్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరగబోయే చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పాక్ భావిస్తోంది. అయితే, ప్రపంచకప్ ఫలితాల కంటే కూడా ఈ మ్యాచ్‌ లో జరిగిన ‘కామెడీ రనౌట్’ క్రికెట్ చరిత్రలో మరో క్రేజీ మెమరీగా మిగిలిపోనుంది.


Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story