Rishabh Pant Controversy: బూతు పదాన్ని వాడిన పంత్.. తప్పేం లేదంటూ అండగా క్రికెట్ దిగ్గజం!

Rishabh Pant Controversy: రిషభ్ పంత్ ప్రదర్శన కంటే మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలే ఎక్కువ చర్చకు దారి తీశాయి.

Rishvik
Published on: 25 May 2026 5:58 PM IST
Rishabh Pant Controversy
X

Rishabh Pant Controversy: బూతు పదాన్ని వాడిన పంత్.. తప్పేం లేదంటూ అండగా క్రికెట్ దిగ్గజం!

Rishabh Pant Controversy: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) పూర్తిగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి.. అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా బ్యాటర్‌గా కూడా పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన పంత్ కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇప్పుడు అతడి ప్రదర్శన కంటే.. మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలే ఎక్కువ చర్చకు దారి తీశాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ ఓటమిని ఎదుర్కొంది. మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్ లైవ్ పోస్ట్‌మ్యాచ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఆ సమయంలో తీవ్ర నిరాశలో ఉన్న పంత్.. ఓ ఒక బూతు పదాన్ని (Fu**) ఉపయోగించాడు. మేము చాలా మంచి టీమ్ అంటూనే ఆ బోటు మాట వాడాడు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది మాజీ క్రికెటర్లు, అభిమానులు పంత్ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం ఈ విషయంలో పంత్‌కు మద్దతుగా నిలిచాడు.

తన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఓడిపోయిన వెంటనే కెప్టెన్‌ను ఇంటర్వ్యూకు పిలవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డాడు. ‘చివరి ఓవర్లో మ్యాచ్ ఓడిపోయినప్పుడు కెప్టెన్ నిరాశ మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వికెట్‌ కీపర్ అయితే పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది. ఎండలో మొత్తం మ్యాచ్ ఫీల్డింగ్ చేసి వెంటనే మైక్ ముందుకు రావాల్సి వస్తే సహజంగానే భావోద్వేగాలు బయటపడతాయి. ముందుగా విజేత జట్టు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో మాట్లాడితే బాగుంటుంది. ఓడిన జట్టు కెప్టెన్‌కు కొన్ని నిమిషాల సమయం ఇవ్వాలి. ముఖంపై నీళ్లు చల్లుకుని, కాస్త ప్రశాంతంగా ఆలోచించే అవకాశం కల్పించాలి. ప్రజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఆలోపు కెప్టెన్ తన భావోద్వేగాలను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అలా చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండొచ్చు’ అని సూచించాడు.

రిషభ్ పంత్ వ్యక్తిత్వాన్ని కూడా సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. ‘పంత్ ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి. అతడు ఆటను ఎంతో బాగా ఆస్వాదిస్తాడు. అలాంటి వ్యక్తి కూడా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడంటే.. ఓడిన కెప్టెన్‌కు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి’ అని ప్రశ్నించాడు. పంత్‌ది తప్పు కాదని, మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంటర్వ్యూలు తీసుకునే బ్రాడ్‌కాస్టర్లదే అని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు ఐపీఎల్ ప్రసార వ్యవస్థపై కూడా చర్చ మొదలైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్లను ఇంటర్వ్యూలకు పిలవడం సరైందా? లేదా వారికి కొంత సమయం ఇవ్వాలా? అనే అంశంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story