SRH-IPL 2027: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027కు కాటేరమ్మ కొడుకు దూరం!

SRH Captain Pat Cummins May Skip IPL 2027. తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) అభిమానులకు చేదు వార్త.

Rishvik
Published on: 4 Jun 2026 7:24 AM IST
SRH-IPL 2027
X

SRH-IPL 2027: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027కు కాటేరమ్మ కొడుకు దూరం!

SRH-IPL 2027: తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) అభిమానులకు చేదు వార్త. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్, ఆస్ట్రేలియా టెస్ట్ సారథి ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయంపై కమిన్స్ పరోక్షంగా పెద్ద హింట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా తరఫున బిజీ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా.. ఐపీఎల్‌లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కమిన్స్ వెల్లడించాడు. తన వర్క్‌లోడ్‌ను మ్యానేజ్ చేసుకోవడానికి, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఐపీఎల్ 2027ను వదులుకోవాల్సి రావచ్చునని కాటేరమ్మ కొడుకు చెప్పుకోచ్చాడు.

ఐపీఎల్ 2026లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత తన భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడిన కమిన్స్..వచ్చే ఏడాది అంతర్జాతీయ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. 'వచ్చే ఏడాది ఏదో ఒక దశలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే ప్రపంచ కప్‌ను మాత్రం వదులుకునే పరిస్థితి లేదు. ఐపీఎల్ ఆడాలా వద్దా అనే విషయంపై సరైన సమయంలో ఫ్రాంచైజీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల కొన్ని గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి' అని కమిన్స్ చెప్పాడు.

అలాగే తనకు టెస్ట్ క్రికెట్, వన్డే ప్రపంచ కప్ ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యమని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్ చెప్పాడు. భారత పర్యటనతో పాటు ఇతర సిరీస్‌ల్లో పూర్తి స్థాయిలో ఆడితే.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు విశ్రాంతి అవసరం అని వెల్లడించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ త్రయం కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌ల పనిభారం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్, జనవరిలో న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఈ ముగ్గురికి రోటేషన్ విధానంలో విశ్రాంతి ఇవ్వవచ్చని కమిన్స్ సూచించాడు. 'మేము ఎప్పుడూ ఓపెన్ మైండ్‌తో ఉంటాం. ఒక టెస్ట్ మ్యాచ్‌ను స్వదేశంలో ఆడుతున్నామా, విదేశాల్లో ఆడుతున్నామా అన్న తేడా ఉండదు. టెస్ట్ మ్యాచ్ అంటే.. టెస్ట్ మ్యాచ్‌నే. దీర్ఘకాలిక షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల కంటే ఎక్కువ మందిని సిద్ధంగా ఉంచాల్సి ఉంటుంది' అని కమిన్స్ తెలిపాడు.

భారత్ సిరీస్ ముగింపు దశలో కొంతమంది బౌలర్లకు అదనపు విశ్రాంతి ఇచ్చి యాషెస్‌కు సిద్ధం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కమిన్స్ ప్రస్తావించాడు. గత 12 నెలల్లో తాను కేవలం ఒక టెస్ట్ మాత్రమే ఆడినందున ప్రస్తుతం చాలా ఫ్రెష్‌గా ఉన్నానని, అయితే రాబోయే 18 నెలలు తమ కెరీర్‌లో అత్యంత సవాళ్లతో కూడిన కాలంగా ఉండబోతున్నాయని కమిన్స్ పేర్కొన్నాడు. కమిన్స్ వ్యాఖ్యలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ ఆస్ట్రేలియా కెప్టెన్ వచ్చే ఐపీఎల్ సీజన్‌కు దూరమైతే.. అది ఎస్ఆర్‌హెచ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. నాయకత్వ పరంగా, బౌలింగ్ పరంగా బరి ఎదురుదెబ్బ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ 2026లో కమిన్స్ గైహాజరీలో ఇషాన్ కిషన్ జట్టును అద్భుతంగా ముందుకు నడిపిన విషయం తెలిసిందే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story