Pat Cummins: ఓటమికి కారణం నేనే.. నిజాయితీగా ఒప్పుకున్న ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్!

Pat Cummins: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు కోల్‌కతా నైట్‌ రైడర్స్ షాక్ ఇచ్చింది.

Rishvik
Published on: 3 May 2026 9:52 PM IST
Pat Cummins
X

Pat Cummins: ఓటమికి కారణం నేనే.. నిజాయితీగా ఒప్పుకున్న ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్!

Pat Cummins: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు కోల్‌కతా నైట్‌ రైడర్స్ షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది. మోస్తరు ఈ లక్ష్యాన్ని కేకేఆర్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఈ పరాజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. సన్‌రైజర్స్ పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయలేదని పేర్కొన్నాడు. 200 వరకు స్కోర్ చేయాల్సిందని మిడిల్ ఓవర్లలో పట్టు కోల్పోయామని చెప్పుకొచ్చాడు.

'ఈ రోజు మాకు కలిసిరాలేదు. మాకు మంచి ఆరంభం దక్కింది. కానీ ఆ తర్వాత మేము మొమెంటమ్ కోల్పోయాం. మా ఆరంభం చూస్తే మేము కనీసం 180 లేదా 200 దగ్గర స్కోర్ చేయాల్సింది. కానీ ఆ స్కోర్ రీచ్ కాలేకపోయాం. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సిందే. నిజానికి 180 స్కోర్ సరిపోతుందని నేను భావించాను. మేము మ్యాచ్-అప్స్‌ను కూడా బాగా ఎంచుకున్నాం.

కానీ రెండో భాగంలో సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాం. తప్పిదం చేసిన వారిలో నేను కూడా ఉన్నాను. పిచ్ కొంత నెమ్మదించింది. కానీ మేము 180 ప్లస్ స్కోర్ చేయాల్సిందే. ఐపీఎల్ టోర్నీలో మార్జిన్లు చాలా చిన్నగా ఉంటాయి. మేము బాగా రాణించాం. మా బౌలింగ్ యూనిట్ మ్యాచ్‌ను చివరి వరకు లాగింది. నా ఓవర్‌లో 27 పరుగులు ఇవ్వడం సమంజసం కాదు. ఇలాంటి చిన్న తప్పిదాలే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. నేను అన్ని రన్స్ ఇవ్వాల్సింది కాదు. మ్యాచ్ ఓటమికి నేను కారణం' అంటూ ప్యాట్ కమిన్స్ ఒప్పుకున్నాడు.

జట్టు ప్రదర్శనలో మంచి అంశాలు ఉన్నప్పటికీ.. కీలక క్షణాల్లో తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ముందున్న మ్యాచ్‌ల్లో ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటే జట్టు మళ్లీ విజయపథంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోల్‌కతా విజయంలో అంగ్‌క్రిష్‌ రఘువంశీ (59; 47 బంతుల్లో), అజింక్య రహానె (43; 36 బంతుల్లో) కీలక పాత్ర పోషించారు. 10 మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు ఇది నాలుగో ఓటమి. ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన కోల్‌కతాకుహ్యాట్రిక్ విజయం దక్కింది. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story