Pat Cummins: ఖవాజా ఆరోపణలు 100 శాతం తప్పు.. 8 ఏళ్ల తర్వాత నోరు విప్పిన ఆసీస్ కెప్టెన్.!
Pat Cummins: 2018 బాల్ టాంపరింగ్ గురించి జట్టులో అందరికీ తెలుసన్న ఉస్మాన్ ఖవాజా ఆరోపణలు 100 శాతం తప్పని, తన రెప్యుటేషన్ దెబ్బతీసేలా ఉన్నాయని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సిడ్నీ ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.
Pat Cummins: ఖవాజా ఆరోపణలు 100 శాతం తప్పు.. 8 ఏళ్ల తర్వాత నోరు విప్పిన ఆసీస్ కెప్టెన్.!
Pat Cummins: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చేసిన బాల్ టాంపరింగ్ ఆరోపణలు 100 శాతం తప్పని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు తమ రెప్యుటేషన్ దెబ్బతీసేలా ఉన్నాయని సిడ్నీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. బాల్ టాంపరింగ్ కోసం గ్రౌండ్‌లోకి శాండ్ పేపర్ తీసుకెళ్లడం తనకు తెలుసన్న ఖవాజా కామెంట్స్‌ను తోసిపుచ్చారు. అయినా ఈ విషయం బహిర్గతం చేయడానికి ఆయనకు 8ఏళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. వివాదానికి కారణం ఖవాజా తన ఆత్మకథ 'సబ్ర్'లో రాసిన విషయాలు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో కేప్ టౌన్ టెస్టులో జరిగిన బాల్ టాంపరింగ్ గురించి ఆస్ట్రేలియా జట్టులోని అందరికీ తెలుసని ఆయన రాశారు. రెండో టెస్టు జరిగిన పోర్ట్ ఎలిజబెత్‌లో కూడా శాండ్‌పేపర్‌ను ఉపయోగించారని పేర్కొన్నారు. ఖవాజా వాదనను డేవిడ్ వార్నర్ ‘100 శాతం కచ్చితమైనది' అని సమర్థించారు.
కమిన్స్ ఈ ప్రెస్‌మీట్‌ను సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించి శుక్రవారం ఉదయం నిర్వహించారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ఖవాజా వ్యాఖ్యలను 'పూర్తిగా అర్థం లేనివి' అని కొట్టిపారేశారు. 'మనమందరం ఎరుగుదుమని ఆయన అంటే, శాండ్‌పేపర్ మైదానంలోకి వెళ్తోందని మాకు తెలుసని అర్థమైతే, ఆయన 100 శాతం తప్పు. ఈ విషయం గత 8 ఏళ్లుగా నేను ఇదే చెబుతున్నాను' అని చెప్పారు. ఖవాజా వ్యక్తుల జీవితాల విషయంలో, పేరు ప్రతిష్టల విషయంలో 'అలవోకగా' మాట్లాడారని కమిన్స్ ఆరోపించారు. అయితే తన కథ చెప్పే హక్కు ఖవాజాకు ఉందని 100 శాతం గౌరవిస్తానని కూడా అన్నారు. బాల్ టాంపరింగ్ ఆరోపణల కంటే ఖవాజా చెప్పిన ఇతర విషయాలు మరింత తీవ్రమైనవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సమష్టి బాధ్యత గురించి ఖవాజా మాట్లాడినట్లు తనకు గుర్తులేదని కూడా చెప్పారు.
2018 మార్చి 24న కేప్ టౌన్ టెస్టులో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతిని శాండ్‌పేపర్‌తో రుద్దుతూ టీవీ కెమెరాలకు చిక్కారు. ఈ ఘటన 'శాండ్‌పేపర్‌గేట్'గా పేరుపొంది ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసింది. నాటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. వార్నర్‌కు ఏడాది నిషేధంతో పాటు జట్టులో నాయకత్వ బాధ్యతలపై జీవితకాల నిషేధం కూడా విధించింది.ఈ వివాదంపై ఇప్పటికే మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఖవాజా వాదనను నిర్ధారిస్తూ మాజీ ఆటగాడు చాడ్ సేయర్స్ ప్రకటన చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. కమిన్స్, వార్నర్ వాదనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటంతో నిజం ఏమిటనే చర్చ క్రీడా వర్గాల్లో కొనసాగుతోంది.




