SRH vs RR Eliminator: వైభవ్ కోసం మూడు ప్రత్యేక ప్లాన్స్ రెడీ.. రాజస్థాన్‌కు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ వార్నింగ్!
SRH vs RR Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ తలపడనున్నాయి.
SRH vs RR Eliminator: వైభవ్ కోసం మూడు ప్రత్యేక ప్లాన్స్ రెడీ.. రాజస్థాన్‌కు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ వార్నింగ్!
SRH vs RR Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో న్యూ చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్లేఆఫ్స్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తమ జట్టు మరింత దూకుడుగా ఆడనుందని స్పష్టం చేశాడు. టైటిల్ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుందని, తమ జట్టుకు అది సాధ్యమే అని ధీమా వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ కోసం మూడు ప్రత్యేక ప్లాన్స్ రెడీగా ఉన్నాయని, ఈసారి స్కోర్ చేయకుండా ఆపుతామని రాజస్థాన్‌కు కమిన్స్ హెచ్చరికలు పంపాడు.
ఎలిమినేటర్ మ్యాచ్ నేపథ్యంలో జియోస్టార్‌తో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. ‘ఫైనల్స్‌కు చేరుకునే వరకు మా విన్నింగ్స్ కాంబినేషన్, విధానాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ ప్లేఆఫ్స్‌లో ఒత్తిడి, నర్వ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని నిజాయితీగా అంగీకరించాలి. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను.. మ్యాచ్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి పశ్చాత్తాపం ఉండకూడదు. అందుకే ఆచితూచి కాకుండా ఇంకా అగ్రెసివ్‌గా ఆడాలని భావిస్తున్నాం. టైటిల్ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఈ సీజన్‌లో మేము ఇప్పటికే ఐదు వరుస విజయాలు సాధించాం. కాబట్టి ఇది కూడా మాకు సాధ్యమే. మా ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు. ఎలిమినేటర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని కమిన్స్ చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్‌పై ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఎస్ఆర్‌హెచ్.. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే కమిన్స్ మాత్రం ప్రతి మ్యాచ్ తమకు కొత్తదేనని తెలిపాడు. ‘ఈ సీజన్‌లో రాయల్స్‌పై మాకు 100 శాతం విజయాల రికార్డు ఉంది. అయినా మేము మొదటి నుంచి ప్రారంభించాల్సిందే. ఎందుకంటే.. ప్రతి మ్యాచ్ కొత్తగా ప్రారంభమవుతుంది. అయితే గత మ్యాచ్‌ల నుంచి నేర్చుకోవచ్చు. మేము ఇప్పటికే రాజస్థాన్‌తో రెండు సార్లు ఆడాం. ఆర్ఆర్ ఆటగాళ్ల బలాలు, బలహీనతలు మాకు తెలుసు. మా ఆటగాళ్లు గత విజయాలను గుర్తు చేసుకుని ఆ నమ్మకంతో బరిలోకి దిగుతారు. ఇప్పటికే ఓడించిన జట్టుతో మళ్లీ ఆడటం మంచి ఫీలింగ్ ఇస్తుంది’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ఫామ్‌లో ఉన్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై కమిన్స్ ప్రత్యేకంగా స్పందించాడు. వైభవ్ ఇప్పటివరకు 14 మ్యాచ్‌లలో 583 పరుగులు చేసి ఆర్ఆర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ 232.27 ఉండటం విశేషం. ఇలాంటి మ్యాచ్ విన్నర్‌ను కట్టడి చేయాలంటే ప్లాన్-B, ప్లాన్-C కూడా సిద్ధంగా ఉండాలని కమిన్స్ తెలిపాడు. ‘ఒక బౌలర్‌గా ముందుగా మీ బలాలను అర్థం చేసుకోవాలి. కానీ ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగల ఆటగాళ్లు ఉంటే.. వారికి ప్రత్యేకంగా అదనపు ప్రణాళికలు సిద్ధం చేయాలి. వైభవ్ కోసం కూడా మేము ప్రత్యేక ప్లాన్స్ సిద్ధం చేశాం. గత మ్యాచ్‌లో అతడు మాఫై సెంచరీ చేశాడు. కొన్ని సందర్భాల్లో మేము అతడిని కట్టడి చేశాం. మరికొన్ని సందర్భాల్లో అతడు మాపై ఆధిపత్యం చెలాయించాడు. ఆ మ్యాచ్‌ల నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం’ అని కమిన్స్ వెల్లడించాడు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడతాం అని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగానే హెచ్చరించాడు. ఇప్పటికే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి స్టార్ బ్యాటర్లతో బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్.. ఇప్పుడు ఎలిమినేటర్‌లో మరోసారి తమ దూకుడు చూపించాలని చూస్తోంది. మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌లతో రాజస్థాన్ కూడా ప్రమాదకరంగానే ఉంది. రెండు పటిష్ట జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్‌గా మారనుంది.




