PBKS Playoffs Scenario: పంజాబ్ ఆశలు సజీవం.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!
PBKS Playoffs Scenario: ఐపీఎల్ 2026లో వరుసగా ఆరు ఓటములు ఎదురైనా పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా పూర్తిగా ముగియలేదు.
PBKS Playoffs Scenario: పంజాబ్ ఆశలు సజీవం.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!
PBKS Playoffs Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో వరుసగా ఆరు ఓటములు ఎదురైనా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా పూర్తిగా ముగియలేదు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ ప్రస్తుతం 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే.. పంజాబ్ గరిష్టంగా 15 పాయింట్లకు చేరుకోగలదు. అయితే ప్లేఆఫ్స్ చేరాలంటే కేవలం విజయం సరిపోదు. ఇతర జట్ల ఫలితాలు కూడా పంజాబ్‌కు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ఆ గణాంకాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఐపీఎల్ 2026లో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో బలమైన స్థితిలో ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు ప్రతి మ్యాచ్ కూడా కీలకంగా మారింది. పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ముందుగా లక్నో సూపర్ జెయింట్స్‌పై తప్పక గెలవాలి. ఆ మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే చివరికి నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రస్తుతం పంజాబ్ +0.227 నెట్ రన్‌రేట్‌తో ఉంది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఎల్‌ఎస్‌జీపై భారీ తేడాతో గెలవాల్సిందే.
అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ ఓటమి కూడా పంజాబ్‌కు కీలకం. ప్రస్తుతం ఆర్‌ఆర్ 12 పాయింట్లతో ఉంది. రాజస్థాన్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. రాజస్థాన్ కనీసం ఒక మ్యాచ్‌లో ఓడిపోవాలి. అప్పుడు ఆర్ఆర్ గరిష్టంగా 14 పాయింట్లకే పరిమితం అవుతుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా మిగిలిన రెండు మ్యాచ్‌లలో కనీసం ఒకదాంట్లో ఓడిపోవాలి. అప్పుడు సీఎస్‌కే కూడా 14 పాయింట్లకే పరిమితం అవుతుంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పంజాబ్‌కు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కేకేఆర్ మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిస్తే 15 పాయింట్లకు చేరుతుంది. అలాంటి పరిస్థితిలో ప్లేఆఫ్స్ బెర్త్ నెట్ రన్‌రేట్ ఆధారంగా నిర్ణయించబడే అవకాశం ఉంది. అందుకే పంజాబ్‌కు కేవలం విజయం కాదు.. భారీ విజయం అవసరం.
ఒక దశలో టాప్-2 రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో పడిపోయింది. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ సేన ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పుడు అభిమానుల దృష్టంతా లక్నోతో జరిగే చివరి మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచి.. ఇతర ఫలితాలు అనుకూలిస్తేనే ప్లేఆఫ్స్ కల నిజమవుతుంది. మొదటి 7 మ్యాచ్‌లలో అపజయమే లేని పంజాబ్.. ఆ తర్వాత ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది. మధ్యలో ఒక్క మ్యాచ్ గెలిచినా.. ఈ పరిస్థితి రాకపోలేదు.




