RCB: ప్లేఆఫ్స్‌ ముందు ఆర్‌సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్.. మాన్‌స్టర్ వస్తున్నాడు!

RCB: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్‌న్యూస్.

Rishvik
Published on: 20 May 2026 7:46 PM IST
RCB
X

RCB: ప్లేఆఫ్స్‌ ముందు ఆర్‌సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్.. మాన్‌స్టర్ వస్తున్నాడు!

RCB: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు గుడ్‌న్యూస్. గాయం కారణంగా నెల రోజుల పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. త్వరలోనే భారత్‌కు రానున్నాడని సమాచారం. ఈ వారంలోనే అతడు ఇండియాకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్‌సీబీకి ఫిల్ సాల్ట్ రాక మరింత బలాన్ని ఇవ్వనుంది. ఓపెనర్‌గా దూకుడైన ఆటతీరుతో పరుగులు రాబడతాడన్న విషయం తెలిసిందే. విషయం తెలిసిన ఆర్‌సీబీ ఫాన్స్ ఆనందం వ్యక్తమ చేస్తున్నారు.

ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. బౌండరీని ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి వేలికి గాయం అయింది. ఆ మ్యాచ్ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. గాయానికి సంబంధించి మెడికల్ టెస్టు కోసం సాల్ట్ మే మొదటి వారంలో ఇంగ్లండ్ వెళ్లాడు. తీవ్రమైన గాయం కాదని స్కానింగ్ రిపోర్టులో తేలింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న సాల్ట్.. త్వరలోనే తిరిగి ఆర్‌సీబీ జట్టులో చేరనున్నాడు. అయితే శుక్రవారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు సాల్ట్ అందుబాటులో ఉంటాడా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సాల్ట్ కీలక ప్లేఆఫ్స్‌ మాత్రం ఆడనున్నాడు.

ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించిన ఆర్‌సీబీ.. 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్‌రేట్‌లో పెద్ద మార్పులు జరగకపోతే.. క్వాలిఫయర్-1లో ఆడడం దాదాపు ఖాయం. ఈ సీజన్‌లో ఫిల్ సాల్ట్ ఆరు మ్యాచ్‌లు ఆడి.. రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఒక 46 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడి దూకుడైన బ్యాటింగ్ ఆర్‌సీబీకి మంచి ఆరంభాలు అందించింది. అతడు దూరమైన తర్వాత కూడా ఆర్‌సీబీ విజయాల బాటలోనే కొనసాగింది. ఇటీవల ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో గెలిచింది.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ 58 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో తొమ్మిదోసారి ఒకే సీజన్‌లో 500కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ త్వరగా అవుటయ్యాడు. తర్వాత మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్‌గే ఎదురుదాడి చేసినా.. ఆర్‌సీబీ బౌలర్లు చివరి ఓవర్లలో బాగా బౌలింగ్ చేశారు. సమిష్టి కృషితో ఆర్‌సీబీ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story