Prabhsimran Singh: ప్రబ్‌సిమ్రాన్ సింగ్‌పై ఫేక్ ప్రచారం.. ఇచ్చిపడేసిన పంజాబ్ స్టార్!
Prabhsimran Singh: పీబీకేఎస్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రాన్ సింగ్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ అయింది.
Prabhsimran Singh: ప్రబ్‌సిమ్రాన్ సింగ్‌పై ఫేక్ ప్రచారం.. ఇచ్చిపడేసిన పంజాబ్ స్టార్!
Prabhsimran Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఓపెనర్ ప్రబ్‌సిమ్రాన్ సింగ్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ అయింది. గత నెల రోజులలో అతడు 10 కిలోల బరువు పెరిగాడని సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓటమి తర్వాత పీబీకేఎస్ జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రబ్‌సిమ్రాన్ స్పందిస్తూ.. తనదైన స్టైల్‌లో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.
తాజాగా ప్రబ్‌సిమ్రాన్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షర్ట్‌లెస్ ఫొటోను షేర్ చేశాడు. దానికి ఓ ఎమోజీని జత చేశాడు. ఆ ఫొటో ధర్మశాలలో తీసుకున్నదిగా తెలుస్తోంది. తన ఫిట్‌నెస్‌పై వస్తున్న ఆరోపణలకు ఇదే సమాధానం అన్నట్లుగా అతడు ఈ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ప్రబ్‌సిమ్రాన్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 2026ను పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ప్రారంభించింది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అపజయంగా కొనసాగింది. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములు చవిచూడటంతో.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో జట్టుపై, ఆటగాళ్లపై సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి.
పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై స్పందించింది. ‘క్రీడల్లో విమర్శలు, అభిప్రాయాలు సహజం. కానీ తప్పుడు కథనాలు సృష్టించి చీప్ పబ్లిసిటీ కోసం ప్రచారం చేయడం సరైంది కాదు. దయచేసి నిజాలు తెలుసుకుని మాత్రమే సమాచారం పంచుకోండి’ అంటూ పీబీకేఎస్ సోషల్ మీడియాలో పేర్కొంది.
పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా ఈ అంశంపై స్పందించారు. ఆటగాళ్లు, జట్టు, బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ సమాచారాన్ని పంచుకునే ముందు బాధ్యతగా వ్యవహరించాలని మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా వినియోగదారులను కోరారు.
ఇక ప్రబ్‌సిమ్రాన్ సింగ్ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 382 పరుగులు చేశాడు. 42.44 సగటు, 169.02 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసి.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో ఓపెనర్ ప్రియాన్స్ ఆర్యతో కలిసి పంజాబ్ జట్టుకు అద్భుత ఆరంభాలు ఇస్తున్నాడు. మిగిలిన మూడు మ్యాచులలో రెండు విజయాలు సాధిస్తే.. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.




