Praful Hinge: 3 వేల నుంచి 3 లక్షలకు.. ఓవర్ నైట్‌లో 'సూపర్ స్టార్'గా ప్రఫుల్ హింగే!

Praful Hinge: మైదానంలో వికెట్లు తీయడమే కాదు సోషల్ మీడియాలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) యువ బౌలర్ ప్రఫుల్ హింగే రికార్డులను తిరగరాస్తున్నాడు.

Rishvik
Published on: 14 April 2026 6:45 PM IST
Praful Hinge
X

Praful Hinge: 3 వేల నుంచి 3 లక్షలకు.. ఓవర్ నైట్‌లో 'సూపర్ స్టార్'గా ప్రఫుల్ హింగే!

Praful Hinge: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) బౌలింగ్ కష్టాలకు చెక్ పడినట్లే కనిపిస్తోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో అడుగుపెట్టిన యువ బౌలర్ ప్రఫుల్ హింగే.. అద్భుత ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో ప్రఫుల్ మొత్తం 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. ఒకే ఓవర్‌లో ముగ్గురు టాప్ బ్యాటర్లను అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్ వంటి డేంజరస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మైదానంలో వికెట్లు తీయడమే కాదు.. సోషల్ మీడియాలోనూ ప్రఫుల్ హింగే రికార్డులను తిరగరాస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌కు ముందు వరకు అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కేవలం 3 వేలు మాత్రమే. సంచలన ప్రదర్శన (4/34) అనంతరం గంటల వ్యవధిలోనే ఆ సంఖ్య ఏకంగా 3.20 లక్షలకు పైగా చేరుకుంది. ఇప్పుడు 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

గతంలో వేలల్లో వచ్చే వ్యూస్ ఇప్పుడు మిలియన్లలోకి మారడం అతని క్రేజ్‌కు అద్దం పడుతోంది. తొలి ఓవర్ వేస్తున్న సమయంలో గ్యాలరీలో ఉండి ఉద్వేగానికి లోనవుతున్న తన తల్లిదండ్రుల వీడియోను ప్రఫుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పటికే 4.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఒక్క మ్యాచ్‌తో సూపర్ స్టార్‌గా మారిపోయిన హింగే పేరు నెట్టింట మార్మోగిపోతోంది.

ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి బంతికే యువ సంచలనం వైభ‌వ్ సూర్య‌వంశీని ఔట్ చేశాడు. మూడో బంతికి టీమిండియా కీపర్ ధ్రువ్ జురెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి బంతికి దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రీటోరియస్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఆరు బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టడంతో.. రాజస్థాన్ పూర్తిగా వెనకపడిపోయింది. ప్రఫుల్‌ తన రెండో ఓవర్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్‌ పరాగ్‌ (4)ను వెనక్కి పంపాడు. మరో కొత్త బౌలర్‌ సకిబ్‌ హుస్సేన్‌ కూడా రాజస్థాన్‌ను దెబ్బ కొట్టాడు. దాంతో రాజస్థాన్ టోర్నీలో మొదటి ఓటమిని చవిచూసింది. దేశవాళీల్లో సత్తా చాటుతున్న హింగేను వేలంలో స‌న్‌రైజ‌ర్స్‌ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story