PSL 2026: పాపం పాకిస్తాన్ క్రికెట్.. జనం లేని పోటీలు.. రంగు పోతున్న చొక్కాలు

PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అయింది. కానీ, నవ్వుల పాలైంది. జనం లేకుండా పోటీలు జరుగుతుండడమే కాకుండా ఆటగాళ్ల డ్రస్ రంగులు వదిలేస్తోంది.

KVD Varma
Published on: 27 March 2026 4:29 PM IST
PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అయింది. కానీ, నవ్వుల పాలైంది.
X

PSL 2026

PSL 2026: ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే జాలి పడాలో.. బాధ పడాలో.. పడీ పడీ నవ్వాలో అర్ధం కాదు. అదిగో అలాంటి పరిస్థితే పాకిస్తాన్ క్రికెట్ ను చూస్తే వస్తుంది. ఐపీఎల్ లో చోటు దక్కలేదని అక్కసుతో పీఎస్ఎల్ అంటూ పాకిస్తాన్ లీగ్ ప్రారంభించిన పాకిస్తాన్ క్రికెట్ ఇప్పుడు దయనీయంగా కనిపిస్తోంది. ఒక పక్క మధ్యప్రాచ్యంలో యుద్ధం. మరోపక్క కనీసం డ్రస్సులను కూడా సరిగా తయారుచేయించుకోలేని దుస్థితి. దీంతో అంతర్జాతీయంగా నవ్వులపాలవుతోంది పాక్ క్రికెట్.

జనం లేకుండానే..

పీఎస్ఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ మార్చి 26న ప్రారంభం అయింది. ప్రారంభ మ్యాచ్ టీవీల్లో చూసిన ప్రపంచ జనాలకు మొదట ఏమీ అర్ధం కాలేదు. లాహోర్-హైదరాబాద్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. స్టేడియంలో ఒక్కళ్ళు కూడా లేరు. రెండు టీమ్స్ తమ ఆట తాము ఆడుకుని వెళ్లిపోయాయి. అందరూ అయ్యో జనం లేకుండా ఏమిటిది అనుకున్నారు. తర్వాత విషయం తెలిసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరిగిపోవడం.. ఎక్కువ ధరకు కూడా పెట్రోల్ దొరకకపోవడంతో మ్యాచ్ లు చూడటానికి జనాల్ని రావద్దని ప్రభుత్వం కోరింది. అందుకే మ్యాచ్ జరిగింది కానీ, అభిమానులు గ్రౌండ్ కి వెళ్లలేకపోయారు. దీంతో ఖాళీ గ్రౌండ్ లోనే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది ఆటగాళ్లు.

ఇది సరే ఏదో అంతర్జాతీయ ఇబ్బందులు అనుకుందాం. కానీ ఇంకో తమాషా కూడా జరిగింది మ్యాచ్ లో.. అదేంటో తెలిస్తే మీరు కూడా నవ్వాపుకోలేరు..

రంగు మారిన బంతి..

చూసేందుకు ఎవరూ లేకపోయినా ఆట ఆడాల్సిందే కదా.. అసలే పీఎస్ఎల్ మరి. అలా హైదరాబాద్, లాహోర్ టీమ్స్ ఆట మొదలు పెట్టాయి. కొద్ది సేపటికి బంతి రంగు మారిపోయింది. అంపైర్లు చూశారు. బంతి మార్చారు. మళ్ళీ రెండోవర్లు ఆడేసరికి తెల్ల రంగు కాస్తా పింక్ అయిపొయింది. దీంతో అంపైర్ల మతిపోయింది. ఇదేమిటి ఇలా? అని శోధించారు. తరువాత విషయం అర్ధమై మతులు పోయి అందరూ వెర్రి ముఖాలు వేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆటగాళ్ల చెమటకు తడిచిన డ్రస్ కలర్ వదిలేసింది. అది బంతిని బట్టకు అదేనండి అక్కడా.. ఇక్కడా ఏసీ తెగ రుద్దేస్తారు కదా.. అలా రుద్దేస్తుంటే బట్టల రంగు దానికి అంటుకుని రంగు మారింది. అదీ సంగతి.

అసలు పీఎస్ఎల్ ఎందుకు మొదలెట్టారో తెలుసా?

మన దేశంలో 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినపుడు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే అదే ఏడాది ముంబయి దాడులు జరిగాయి. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు కరాళ నృత్యం చేశారప్పుడు. దీంతో ఐపీఎల్ నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లను పక్కకు తప్పించారు. దీంతో పౌరుషం ముంచుకొచ్చిన పాక్ క్రికెట్ పెద్దలు మేమూ లీగ్ స్టార్ట్ చేస్తాం అని ఐపీఎల్ లో చోటు దక్కని విదేశీ ఆటగాళ్లను తెచ్చి.. అక్కడ పీఎస్ఎల్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మన ఐపీఎల్ కు పోటీగా వాళ్ళూ పోటీలు పెట్టి జబ్బలు చరుచుకుంటూ ఉంటారు.

సరే ఎదో వాళ్ళ ఏడుపు వాళ్ళేడుస్తారు కానీ, ఇదేంటండీ మరీదారుణంగా చెమటతో క్రికెట్ డ్రస్ రంగు పోవడం.. అది బాల్ కి అంటుకుని దాని రంగు మారిపోవడం అంతా మన టాలీవుడ్ సినిమాలో బ్రహ్మానందం అండ్ కో లీగ్ కామెడీలా లేదూ. ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ లీగ్ గురించి అలానే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో.

ఇక్కడ సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలు చూస్తే అయ్యో పాకిస్తాన్ క్రికెట్ అని జాలి పడతారు.




KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story