Punjab Kings: మరో టీమ్ కొనాలనుంది.. పంజాబ్ కింగ్స్ యజమాని కీలక వ్యాఖ్యలు!

Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని మోహిత్ బర్మన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Rishvik
Published on: 18 May 2026 6:45 PM IST
Punjab Kings
X

Punjab Kings: మరో టీమ్ కొనాలనుంది.. పంజాబ్ కింగ్స్ యజమాని కీలక వ్యాఖ్యలు!

Punjab Kings: మహిళల క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్)పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని మోహిత్ బర్మన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో డబ్ల్యూపీఎల్‌లో ఒక జట్టును కొనుగోలు చేయాలనే ఆసక్తి తమకు ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లు మాత్రమే ఉండగా.. అందులో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన జట్లు.

బీసీసీఐ ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌ను విస్తరించే ఆలోచనలో లేదని గతంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే మహిళల క్రికెట్ భవిష్యత్తుపై తాను ఎంతో నమ్మకంగా ఉన్నానని మోహిత్ బర్మన్ తెలిపారు. ‘చాలా తక్కువ సమయంలోనే డబ్ల్యూపీఎల్ మహిళల క్రికెట్‌కు కీలక వేదికగా మారింది. మహిళల ఆట అభివృద్ధి అద్భుతంగా ఉంది.

పెట్టుబడుల విషయంలో ప్రతి సంస్థ తమ వ్యూహాలు, సమయం, వ్యాపార అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. మొదట్లో మేము జట్టు కొనకపోవడం అంటే మహిళల క్రికెట్‌పై నమ్మకం లేదని కాదు. వ్యక్తిగతంగా చెప్పాలంటే మహిళల క్రికెట్ భవిష్యత్తు చాలా గొప్పగా కనిపిస్తోంది. మేము కూడా ఒక మహిళల ఐపీఎల్ జట్టును కొనాలని కోరుకుంటున్నాం’ అని బర్మన్ చెప్పుకొచ్చారు.

భారత మహిళల జట్టు విజయాలు, డబ్ల్యూపీఎల్ ప్రభావం వల్ల యువతుల్లో యువ మహిళా క్రికెటర్లలో ఆసక్తి పెరిగిందని మోహిత్ బర్మన్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలవడం మహిళల క్రికెట్‌కు మంచి ఊపునిచ్చిందని చెప్పారు. ‘మహిళల క్రికెట్ నాణ్యత, ప్రేక్షకుల స్పందన, కమర్షియల్ విలువ అన్నీ అంచనాలకు మించి పెరిగాయి. ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం బాగా ఉంది. ఇప్పుడు యువతులు మహిళా క్రికెటర్లను స్పోర్ట్స్ ఐకాన్లుగా చూస్తున్నారు. ఇది మహిళల క్రికెట్ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తోంది’ అని తెలిపారు.

మరోవైపు ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌ కూడా భవిష్యత్తులో మహిళల క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తిగా ఉంది. సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘వెంటనే కాకపోయినా.. రాబోయే సంవత్సరాల్లో సీఎస్‌కే మహిళల క్రికెట్‌లో అడుగుపెడుతుంది. మా మొదటి లక్ష్యం మహిళల క్రికెటే' అని వెల్లడించారు.

డబ్ల్యూపీఎల్ 2023లో ఐదు జట్లతో ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన సీజన్‌లలో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు టైటిల్స్ సాధించాయి. మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణతో భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీలు డబ్ల్యూపీఎల్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో మహిళల జట్టు కూడా మరింత బలపడనుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story