Vaibhav Sooryavanshi: టెస్ట్ కెరీర్ కష్టమే.. వైభవ్ సూర్యవంశీకి అదే అతిపెద్ద సమస్య!
Vaibhav Sooryavanshi: వైట్‌బాల్ క్రికెట్‌లో వరుస అవకాశాలు రావడం వైభవ్ సూర్యవంశీ టెస్ట్ కెరీర్‌కు ఓ సవాలుగా మారొచ్చని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
Vaibhav Sooryavanshi: టెస్ట్ కెరీర్ కష్టమే.. వైభవ్ సూర్యవంశీకి అదే అతిపెద్ద సమస్య!
Vaibhav Sooryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అతి తక్కువ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే టీ20ల్లో సత్తా చాటుతున్న వైభవ్.. ఇప్పటికే ఆరు ఇన్నింగ్స్‌ల్లో 193 పరుగులు చేశాడు. 189.21 స్ట్రైక్‌రేట్‌తో చేయడం ఇక్కడ విశేషం. త్వరలోనే వన్డేల్లో కూడా అవకాశాలు రావొచ్చు. వైట్‌బాల్ క్రికెట్‌లో వరుస అవకాశాలు రావడం బుడ్డోడి టెస్ట్ కెరీర్‌కు ఓ సవాలుగా మారొచ్చని టీమిండియా మాజీ హెడ్ కోచ్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున రెడ్‌బాల్ క్రికెట్ ఆడుతున్నాడు. భారత్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీల్లో ఒకటైన దులీప్ ట్రోఫీ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో తనను తాను నిరూపించుకునే అవకాశం ఉంది. అయితే టెస్ట్ క్రికెట్‌లో స్థిరపడాలంటే కనీసం రెండు పూర్తి సీజన్ల పాటు దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్ ఆడటం ఎంతో ఉపయోగపడుతుందని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. 'వైభవ్ విషయంలో తొందరపడకుండా సహనం పాటించాలి. 15 ఏళ్ల ఈ యువ ఆటగాడికి సరైన ప్రాక్టీస్, దేశవాళీ క్రికెట్‌లో తగినంత మ్యాచ్ అనుభవం లభిస్తే టెస్ట్ జట్టులోనూ సత్తా చాటగడు. ఆ సామర్థ్యం అతడికి ఉంది. అయితే ఇప్పటికే జాతీయ జట్టులో రాణిస్తున్న ఆటగాళ్ల మధ్య తుది జట్టులో చోటు దక్కించుకోవడం మరో పెద్ద సవాల్' అని ద్రవిడ్ అన్నాడు.
వైభవ్‌కు అసలు సమస్య నైపుణ్యం కాదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. 'భారత్ తరఫున వైట్‌బాల్ క్రికెట్‌లో వరుసగా ఆడే అవకాశాలు పెరిగితే.. దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్‌కు అవసరమైన సమయం కేటాయించడం కష్టమవుతుంది. షెడ్యూల్ కారణంగా రెండు పూర్తి దేశవాళీ సీజన్లు ఆడలేకపోతే.. టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన అనుభవాన్ని సంపాదించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది' అని వివరించాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా ఉన్న సమయంలోనే వైభవ్ ఎదుగుదలను ద్రవిడ్ దగ్గరగా గమనించాడు. 2026 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ తరఫున వైభవ్ 776 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
2026 ఐపీఎల్ అనంతరం కొలంబోలో శ్రీలంక ‘ఎ’తో జరిగిన లిస్ట్-ఎ ట్రై సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌ను చాటుకున్నాడు. జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో ఆకట్టుకున్నాడు. 151 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అతడి భవిష్యత్తుపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే రెడ్‌బాల్ క్రికెట్‌లో మాత్రం వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అతడి బ్యాటింగ్ సగటు 17.25గా ఉంది. అందుకే టెస్టుల్లోకి రావాలంటే కేవలం ప్రతిభ సరిపోదని, ఎక్కువ కాలం రెడ్‌బాల్ క్రికెట్ ఆడి తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవడం కీలకం. సరైన అవకాశాలు, తగినంత రెడ్‌బాల్ అనుభవం లభిస్తే.. టెస్ట్ జట్టులో రాణించగల సామర్థ్యం అతడిలో ఉంది. అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో ఎదుగుదల కారణంగా దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్‌కు సమయం కేటాయించడం కష్టమవుతుందని ద్రవిడ్ అంటున్నాడు. వైభవ్ ఈ సవాల్‌ను ఎలా అధిగమిస్తాడనేది అతడి టెస్ట్ భవిష్యత్తును నిర్ణయించనుంది.




