Rahul Dravid's Son: రాహుల్ ద్రవిడ్ వారసుడు సిద్ధం.. 30 ఏళ్ల తర్వాత భారత జట్టుకు..!
Anvay Dravid selected India's Under-19 Squad. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు జాతీయ స్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు.
Rahul Dravid's Son: రాహుల్ ద్రవిడ్ వారసుడు సిద్ధం.. 30 ఏళ్ల తర్వాత భారత జట్టుకు..!
Rahul Dravid's Son: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు జాతీయ స్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ‘ద వాల్’ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌ను శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో సెలెక్టర్లు చోటు కల్పించారు. మూడు దశాబ్దాల క్రితం అండర్-19 స్థాయిలో భారత్‌కు ద్రవిడ్ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అతని కుమారుడు కూడా భారత జెర్సీ ధరించే అవకాశాన్ని అందుకున్నాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జూనియర్ క్రికెట్ కమిటీ గురువారం శ్రీలంక పర్యటనకు సంబంధించిన భారత అండర్-19 జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు, రెండు మల్టీ-డే మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే, మల్టీ-డే జట్లకు యశ్‌బర్ధన్ సింగ్ చౌహాన్ భారత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. లక్ష్య రైచందానీ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 17 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్ వన్డే జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. రాజత్ బఘేల్‌తో కలిసి అతడు కీపింగ్ బాధ్యతల కోసం పోటీపడనున్నాడు. ఇద్దరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది. ఇప్పటికే దేశీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన అన్వయ్‌కు ఇది కీలక సిరీస్ అనే చెప్పాలి.
గత వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్.. తన జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 220 పరుగులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్ అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అన్వయ్ ఇప్పటికే ఇండియా అండర్-19 బి జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. బెంగళూరులో జరిగిన ట్రై సిరీస్‌లో భారత్ అండర్-19 ఎ, భారత్ అండర్-19 బి సహా అఫ్గానిస్తాన్ అండర్-19 జట్లు పాల్గొన్నాయి. అలాగే అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో టీమ్-సీకి కూడా ఎంపికయ్యాడు.
రాహుల్ ద్రవిడ్ కుటుంబం నుంచి జాతీయ జట్టులోకి ఆటగాడు రావడం ఇదే మొదటిసారి కాదు. 2024లో ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అన్వయ్ ఆ అవకాశాన్ని అందుకుని భారత జెర్సీలో మెరవడానికి సిద్ధమవుతున్నాడు. తండ్రి రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలిచాడు. ఇప్పుడు అతని చిన్న కుమారుడు అన్వయ్ కూడా అదే మార్గంలో అడుగులు వేస్తూ భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. శ్రీలంక పర్యటనలో అతని ప్రదర్శనపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.




