Rajat Patidar: క్వాలిఫయర్-1 మ్యాచ్ మాదే, ఐపీఎల్ 2026 ట్రోఫీ మాదే.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
RCB captain Rajat Patidar Comments. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
Rajat Patidar: క్వాలిఫయర్-1 మ్యాచ్ మాదే, ఐపీఎల్ 2026 ట్రోఫీ మాదే.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajat Patidar: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ధర్మశాల వేదికగా తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. అయితే టాస్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
టాస్ అనంతరం మాట్లాడిన రజత్ పాటీదార్.. టాస్ తమకు పెద్ద విషయం కాదని స్పష్టం చేశాడు. బెంగళూరు జట్టులో ప్రస్తుతం ఒక్కటే లక్ష్యం ఉందని, అదే ఐపీఎల్ ట్రోఫీ గెలవడమని చెప్పాడు. ‘అవును.. టాస్ గెలిస్తే బాగుండేది. కానీ టాస్ అనేది మాకు అంత ముఖ్యమైన విషయం కాదు. ప్రస్తుతం మా జట్టు మొత్తం దృష్టి ఒక్కటే.. ఐపీఎల్ ట్రోఫీని గెలవడం. మాకు అది తప్ప మరో ఆలోచన లేదు. ఈ మ్యాచ్‌లో మేమే గెలుస్తామనే నమ్మకం ఉంది. అలానే ట్రోఫీ కూడా మరోసారి అందుకునేందుకు ప్రయత్నిస్తాం’ అంటూ ధీమా వ్యక్తం చేశాడు. క్వాలిఫయర్-1 మ్యాచ్ మాదే, ఐపీఎల్ 2026 ట్రోఫీ మాదే అని ఆర్సీబీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. పాటీదార్ చేపినట్లే ఆర్సీబీ దంచికొడుతోంది. 4 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది.
ఈ సీజన్‌లో ఆర్సీబీ అత్యంత నిలకడగా ఆడుతోంది. లీగ్ దశలో 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన బెంగళూరు.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో గుజరాత్‌ను వెనక్కి నెట్టింది. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో కొనసాగుతుండగా.. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కెప్టెన్‌గా పాటీదార్ కూడా ప్రశాంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా బలమైన బౌలింగ్ దాడితో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ బ్యాటింగ్‌లో రాణిస్తుండగా.. రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. దీంతో ఈ క్వాలిఫయర్-1 పోరు అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్‌గా మారనుంది.
క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 ద్వారా మరో అవకాశం ఉంటుంది. అయితే ఆర్సీబీ మాత్రం ఈ మ్యాచ్‌తోనే ఫైనల్ బెర్త్ ఖాయం చేసి.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ వైపు మరో అడుగు వేయాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆర్సీబీ గెలిచి.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈసారి గెలిచి రెండోది ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.




