Rajat Patidar: రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. రెండేళ్లకే దిగ్గజాలు ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్!

Rajat Patidar: వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు జట్టును చేర్చిన ఐదో కెప్టెన్‌గా రజత్ పాటీదార్ ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు.

Rishvik
Published on: 27 May 2026 6:41 PM IST
Rajat Patidar
X

Rajat Patidar: రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. రెండేళ్లకే దిగ్గజాలు ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్!

Rajat Patidar: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్ రజత్ పాటీదార్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. కేవలం 33 బంతుల్లో 93 పరుగులతో అజేయంగా నిలిచిన రజత్.. ఆర్సీబీ 254/5 భారీ స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఆర్సీబీ బౌలర్లు కూడా అదరగొట్టడంతో గుజరాత్ 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో పాటీదార్ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు జట్టును చేర్చిన ఐదో కెప్టెన్‌గా ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు.

ఆర్సీబీకి కొత్త యుగం:

ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో ఐపీఎల్ 2025కు ముందు ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటీదార్ బాధ్యతలు చేపట్టాడు. పాటీదార్ కెప్టెన్ ఏంటి అని అందరూ విమర్శలు చేశారు. అయితే అతడు అద్భుత సారథ్యంతో జట్టును ముందుకు నడిపాడు. తన తొలి సీజన్‌లోనే ఆర్సీబీ ఫ్రాంచైజీకి తొలి టైటిల్ అందించాడు. పంజాబ్ కింగ్స్‌పై ఫైనల్‌లో ఆర్సీబీని గెలిపించి.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇప్పుడు 2026లో కూడా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి.. మరోసారి ఫైనల్‌కు చేరింది. దీంతో వరుసగా రెండోసారి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌గా పాటీదార్ ప్రత్యేక గుర్తింపు పొందాడు.

ఒక్కసారి కాదు.. రెండుసార్లు:

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఘనతను ఒక్కసారి కాదు.. రెండుసార్లు సాధించాడు. మహీ నాయకత్వంలో సీఎస్‌కే 2010, 2011 సీజన్లలో వరుసగా టైటిళ్లు గెలిచింది. అనంతరం 2012, 2013లో కూడా వరుసగా ఫైనల్స్ చేరింది. 2018లో తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చిన తర్వాత మరోసారి టైటిల్ సాధించింది. 2019 ఫైనల్‌లో కేవలం ఒక్క పరుగుతో ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ అగ్రస్థానంలో నిలిచాడు.

ముంబై ఇండియన్స్ గోల్డెన్ ఎరా:

రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఆధిపత్యం చెలాయించింది. 2013 నుంచి 2023 మధ్య కాలంలో ముంబై ఐదు టైటిళ్లు గెలిచింది. ముఖ్యంగా 2019, 2020లో వరుసగా టైటిళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై జట్టు అత్యంత నిలకడైన జట్టుగా నిలిచింది. అయితే 2024 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ముంబై పతనం ఆరంభమైంది.

రెండు టీమ్స్ వరుస సీజన్లలో ఫైనల్‌కు:

శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ గెలిపించినా.. అయ్యర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అయ్యర్.. పంజాబ్‌ను 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఫైనల్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమి చవిచూసింది.

అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్:

2022లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించగా.. అతడు అద్భుతాలు చేశాడు. అరంగేట్ర సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించాడు. 2023లో కూడా గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చినా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఉత్కంఠభరిత పోరులో ఓడిపోయింది. అనంతరం హార్దిక్ తిరిగి ముంబై ఇండియన్స్‌కు చేరాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లడం చాలా పెద్ద విషయం. ఇప్పుడు రజత్ పాటీదార్ కూడా ధోని, రోహిత్, అయ్యర్, హార్దిక్ లాంటి స్టార్ కెప్టెన్ల సరసన చేరడంతో అతడి నాయకత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story