Rajat Patidar: నిజం చెప్పనా.. ఆర్సీబీలో ఆడాలనే ఆసక్తే లేదు.. రజత్ పటిదార్ షాకింగ్ వ్యాఖ్యలు!
Rajat Patidar on Playing RCB. ఒకపుడు తనకు ఆర్సీబీలో ఆడాలనే ఆసక్తే లేదంటూ రజత్ పటిదార్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.
Rajat Patidar: నిజం చెప్పనా.. ఆర్సీబీలో ఆడాలనే ఆసక్తే లేదు.. రజత్ పటిదార్ షాకింగ్ వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రజత్ పటిదార్ ప్రత్యేక స్థానం సంపాదించాడు. తన నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీకి రెండు ట్రోఫీలు అందించాడు. తన అద్భుత నాయకత్వంతో 18 ఏళ్ల నిరీక్షణకు 2025లో తెరదించిన పటిదార్.. 2026లో కూడా ఆర్సీబీకి మరో టైటిల్ అందించాడు. ఇప్పుడు పటిదార్ ఆర్సీబీ తూరుపు ముక్క అయ్యాడు. అలాంటి పటిదార్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరుకు రెండు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన సారథిగా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న పటిదార్.. ఒకప్పుడు తాను తిరిగి ఆర్సీబీలో చేరాలనే ఆసక్తి కూడా చూపలేదని వెల్లడించాడు. తన కెరీర్‌లో కీలక మలుపు తీసుకొచ్చిన ఆ నిర్ణయం వెనుక ఉన్న కథను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
గాయం కలిసొచ్చింది:
2021 ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ రజత్ పటిదార్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి.. పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం 2022 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు. దీంతో పటిదార్ ఐపీఎల్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అయితే ఆర్సీబీ ఆటగాడు లువ్నిత్ సిసోడియా గాయపడటంతో.. అతడికి కలిసొచ్చింది. సిసోడియా స్థానంలో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా పటిదార్‌కు మరోసారి ఆర్సీబీ అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో తాను ఆర్సీబీలో చేరాలనుకోలేదని పటిదార్ తాజాగా వెల్లడించాడు.
అవకాశం రాదని స్పష్టంగా చెప్పారు:
'నిజం చెప్పాలంటే.. నేను అప్పుడు ఆర్సీబీలో తిరిగి చేరాలనుకోలేదు. నన్ను రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా తీసుకుంటున్నారని చెప్పారు. అంటే జట్టులో ఆడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అర్థమైంది. క్యాంప్‌లో చేరిన తర్వాత కూడా అదే ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఎవరైనా గాయపడితే తప్ప నీకు అవకాశం రాదని స్పష్టంగా చెప్పారు. అప్పటికే నా పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా మందితో మాట్లాడాను. బెంచ్‌పైనే కూర్చోవడానికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే మొదట ఆ ఆఫర్‌ను అంగీకరించాలనే ఆలోచన కూడా లేదు. కానీ ఒప్పుకున్నా' అని పటిదార్ చెప్పాడు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో అజేయ శతకం:
2022 సీజన్ పటిదార్‌కు కలిసొచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో అజేయ శతకం (112) బాది ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఇన్నింగ్స్ అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత పటిదార్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2025 మెగా వేలం అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతడు.. ఫ్రాంచైజీ చరిత్రలో తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. అక్కడితో ఆగకుండా 2026 సీజన్‌లోనూ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టి వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఒకప్పుడు ఆర్సీబీలో చేరడానికే ఆసక్తి చూపని ఆటగాడు.. నేడు అదే ఫ్రాంచైజీకి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలవడం క్రికెట్‌లో అవకాశాల విలువను మరోసారి నిరూపించింది. పటిదార్ స్టోరీ యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా మారింది.




