భారత్ - ఆస్ట్రేలియా టెస్ట్ వేదికలో మార్పు.. క్లారిటీ ఇచ్చిన సౌరబ్ తివారీ.. ఎందుకంటే..?

India vs Australia: భారత క్రికెట్ జట్టు త్వరలో ఆస్ట్రేలియా తో తలపడనున్న టెస్ట్ సిరీస్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టతనిచ్చింది.

Venkat
Published on: 18 Sept 2026 10:28 PM IST
India vs Australia
X

భారత్ - ఆస్ట్రేలియా టెస్ట్ వేదికలో మార్పు.. క్లారిటీ ఇచ్చిన సౌరబ్ తివారీ.. ఎందుకంటే..?

India vs Australia: శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నాయకత్వంలోని భారత టెస్ట్ జట్టు వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పోటీపడనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను రాంచీ (Ranchi) వేదికగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ మ్యాచ్ వేదిక మారుతుందనే వదంతులు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. శీతాకాలంలో తొందరగా చీకటి పడటం, చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల మ్యాచ్‌ను వేరే చోటుకి మారుస్తున్నారనే చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, మాజీ క్రికెటర్ సౌరబ్ తివారీ (Saurabh Tiwary) స్వయంగా స్పందించి ఈ ఊహాగానాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టారు.

మీడియాతో మాట్లాడిన సౌరబ్ తివారీ వేదిక మార్పు వార్తలను పూర్తిగా ఖండించారు. షెడ్యూల్ చేసిన వేదికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ బోర్డుకు ఏదైనా లేఖ రాయాల్సి వస్తే అది తాను మాత్రమే రాయాలని, ఇప్పటివరకు అలాంటి పనేదీ జరగలేదని ఆయన తేల్చిచెప్పారు. దీంతో రాంచీ వేదికపై నెలకొన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) ఫైరల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. అంతకుముందు న్యూజిలాండ్ (New Zealand) గడ్డపై రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా, ఆ తరువాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‌ను ప్రారంభించనుంది. జనవరి 21వ తేదీన నాగ్‌పూర్ (Nagpur) వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది. ఆ తర్వాత చెన్నై (Chennai), గువహాటి (Guwahati), రాంచీ, అహ్మదాబాద్ (Ahmedabad) నగరాలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. రాంచీలో ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జార్ఖండ్ అసోసియేషన్ ప్రకటనతో క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.