ఎంట్రీ నాకు ఇష్టం లేదు.. భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రవి బిష్ణోయ్!
Ravi Bishnoi on His Career: భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన అంతర్జాతీయ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎంట్రీ నాకు ఇష్టం లేదు.. భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రవి బిష్ణోయ్!
Ravi Bishnoi on His Career: భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన అంతర్జాతీయ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తరచూ జట్టులోకి రావడం, మళ్లీ బయటకు వెళ్లడం తనకు ఇష్టం లేదని.. ఇకపై టీమిండియాలో శాశ్వత సభ్యుడిగా కొనసాగాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. గత మూడు టీ20 ప్రపంచకప్‌లకు ఎంపిక కాకపోయినా నిరాశ చెందకుండా తన ఆటపై దృష్టి పెట్టానని తెలిపాడు. 2028 టీ20 ప్రపంచకప్‌లో తప్పకుండా ఆడుతానని రవి బిష్ణోయ్ ధీమా వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న రవి బిష్ణోయ్.. ఈసారి తన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ కంటే ముందుగా ఎంపిక కావడం తనకు మరింత బాధ్యతను తెచ్చిపెట్టిందని చెప్పాడు. 25 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇప్పటివరకు భారత్ తరఫున 44 టీ20 మ్యాచ్‌లు ఆడి 64 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని కూడా అందుకున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను మళ్లీ మళ్లీ కంబ్యాక్ చేసే ఆటగాడిగా గుర్తింపు పొందాలని కోరుకోవడం లేదు. జట్టులో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడమే నా లక్ష్యం. ప్రస్తుతం నా దృష్టి అంతా అదే దిశగా కేంద్రీకరించాను. 2028 టీ20 ప్రపంచకప్‌లో తప్పకుండా ఆడుతా. అదే నా కల' అని బిష్ణోయ్ తెలిపాడు.
గత మూడు ప్రపంచకప్‌లకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించినా.. భారత జట్టు విజయం సాధించడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని రవి బిష్ణోయ్ చెప్పాడు. 'ప్రపంచకప్ ఆడటం ప్రతి క్రికెటర్ కల. నాకు కూడా అదే కల. అయితే నా స్థానంలో ఆడిన వారు అద్భుతంగా రాణించారు. భారత జట్టులో పోటీ చాలా తీవ్రంగా ఉంది.
అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారీ సిద్ధంగా ఉండి మంచి ప్రదర్శన చేయాలి' అని చెప్పాడు. ప్రతికూల పరిస్థితుల్లో తన కుటుంబం, కోచ్‌లు ఎంతో అండగా నిలిచారని వెల్లడించాడు. 'నిరాశ చెందడం సహజం. కానీ ఎక్కువ కాలం అదే భావనలో ఉంటే ఆటపై ప్రభావం పడుతుంది. నా తల్లిదండ్రులు, కోచ్ షారుఖ్ భాయ్ ఎప్పుడూ నాకు ధైర్యం చెప్పారు. అదే నన్ను ముందుకు నడిపించింది' అని పేర్కొన్నాడు.
రవి బిష్ణోయ్ తన బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. 'నేను చాలా సింపుల్‌గా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. 5-6 మీటర్ల లెంగ్త్‌లో బంతిని వేయగలిగితే బ్యాటర్లకు ఆడటం కష్టమవుతుంది. అందుకే ఇటీవల నేను బేసిక్స్ పైనే ఎక్కువగా పనిచేశాను. నా బౌలింగ్‌లో సరళతే నా బలం' అని వివరించాడు.
ఆధునిక క్రికెట్‌లో ఆల్‌రౌండ్ నైపుణ్యాలు అవసరమని భావిస్తున్న బిష్ణోయ్.. బ్యాటింగ్‌పైనా ప్రత్యేకంగా శ్రమిస్తున్నాడు. 'ప్రస్తుతం ప్రతి ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లోనూ రాణించాలి. అందుకే బ్యాటింగ్‌పై కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాను. భవిష్యత్తులో భారత జట్టుకు అన్ని విభాగాల్లో ఉపయోగపడే మ్యాచ్ విన్నర్‌గా మారాలనుకుంటున్నాను' అని తెలిపాడు.
టీ20 ఫార్మాట్‌లో మంచి పేరు సంపాదించినప్పటికీ.. తన అంతిమ లక్ష్యం టెస్టు క్రికెట్ ఆడటమేనని రవి బిష్ణోయ్ వెల్లడించాడు. 'టెస్టు క్రికెట్‌నే అసలైన ఫార్మాట్‌గా భావిస్తాను. ఒక రోజు భారత టెస్టు జట్టులో చోటు సంపాదిస్తా. నా డ్రీమ్ అది' అని చెప్పాడు. ప్రస్తుతం కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో తన ప్రయాణం కొత్త మలుపు తిరుగుతుందనే ఆశాభావంతో బిష్ణోయ్ ఉన్నాడు.




