Vaibhav Sooryavanshi: ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. రెండో సచిన్ అవసరం లేదు!
Vaibhav Sooryavanshi Just Showed Trailer. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.
Vaibhav Sooryavanshi: ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. రెండో సచిన్ అవసరం లేదు!
వైభవ్ సూర్యవంశీ: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన 15 ఏళ్ల వైభవ్.. తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. కేవలం 10 బంతుల్లో రెండు భారీ సిక్సర్లతో 14 పరుగులు చేశాడు. బుడ్డోడి ఆటకు అందరూ ఫిదా అయ్యారు. యువ ఓపెనర్‌పై భారత మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది ట్రైలర్ మాత్రమే అని, అసలు సినిమా ముందుందని పేర్కొన్నాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆర్ అశ్విన్.. వైభవ్ సూర్యవంశీ ఆటను చూస్తే భవిష్యత్తులో అతడు ఎంత పెద్ద క్రికెటర్‌గా ఎదగబోతున్నాడో అర్థమవుతోందని చెప్పాడు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లపై ఎలాంటి బెరుకు లేకుండా షాట్లు ఆడిన తీరు తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. 'వైభవ్‌ను చూసి చాలా సంతోషంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌ను అతడు ఎదుర్కొన్న తీరు చూస్తే.. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడో చిన్న ట్రైలర్ మాత్రమే చూశాం. మొదటి మ్యాచ్ అయినా ఒత్తిడికి ఏమాత్రం లొంగిపోకుండా ఆడాడు. అతని ముఖంలో భయం గానీ, టెన్షన్ గానీ కనిపించలేదు. వైభవ్ ఇక్కడ ఆడటానికే వచ్చాడు. భారత జట్టులో చాలా కాలం కొనసాగుతాడనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
అయితే వైభవ్‌ను ఇప్పుడే క్రికెట్ దిగ్గజాలతో పోల్చడం సరైన విధానం కాదని అశ్విన్ సూచించాడు. అతడిని రెండో సచిన్ టెండూల్కర్, రెండో డాన్ బ్రాడ్‌మన్ లేదా రెండో షేన్ వార్న్ అని పిలవాల్సిన అవసరం లేదన్నాడు. బుడ్డోడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అభిప్రాయపడ్డాడు. 'ఈ కుర్రాడు ఎలా ఎదుగుతాడో చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతనిలో మంచి కెరీర్ నిర్మించుకునే సామర్థ్యం ఉంది. కానీ అతడిని ఎవరితోనూ పోల్చవద్దు. మాకు రెండో డాన్ బ్రాడ్‌మన్ అవసరం లేదు, రెండో సచిన్ టెండూల్కర్ అవసరం లేదు, రెండో షేన్ వార్న్ కూడా అవసరం లేదు. మాకు మొదటి వైభవ్ చాలు. అతని ప్రయాణాన్ని చూసి మనం నేర్చుకోవాలి' అని అశ్విన్ స్పష్టం చేశాడు.
ఇక ఇటీవల టీ20ల్లో భారత జట్టు వరుస వైఫల్యాలపై కూడా యాష్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ కోల్పోవడం, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ విజయాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పరాజయాల గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. 'విమర్శలనే జనాలు సులభంగా నమ్ముతారు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ప్రతికూల వార్తలకే ఎక్కువ ఆదరణ ఉంది. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి టీ20 ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఒలింపిక్స్ కూడా రెండేళ్ల తర్వాతే ఉన్నాయి' అని యాష్ చెప్పాడు.
'ఈ యువ ఆటగాళ్లను ఆడనివ్వాలి, ఓడనివ్వాలి. వైఫల్యాలు లేకుండా విజయం రాదు. నేర్చుకునే సమయం ఇదే. భారత సీనియర్ ఆటగాళ్లు నిర్మించిన బలమైన జట్టు సంస్కృతిలో ఈ యువ క్రికెటర్లు వచ్చి టీ20 ప్రపంచకప్ గెలిచారు. ఇప్పుడు వీరికి వైఫల్యాలను అనుభవించే అవకాశం ఇవ్వకపోతే.. భవిష్యత్తులో దిగ్గజాలు, ఛాంపియన్లు ఎలా తయారవుతారు?. ప్రతి గొప్ప ఆటగాడు విజయానికి ముందు ఎన్నో పరాజయాలు చూశాడు' అని అశ్విన్ ఉదహరించాడు. వైభవ్ అరంగేట్రంపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత క్రికెట్‌కు మరో సూపర్‌స్టార్ సిద్ధమవుతున్నాడని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




