Ravindra Jadeja Record: టెస్టు క్రికెట్ చరిత్రలోనే.. రవీంద్ర జడేజా అరుదైన రికార్డు!

Ravindra Jadeja Record: టెస్టు క్రికెట్ చరిత్రలో 4 వేలకు పైగా పరుగులు, 350 వికెట్లు పడగొట్టిన నాలుగో ప్లేయర్‌గా జడేజా రికార్డుల్లో నిలిచాడు.

Rishvik
Published on: 17 Aug 2026 6:38 PM IST
Ravindra Jadeja Record
X

Ravindra Jadeja Record: టెస్టు క్రికెట్ చరిత్రలోనే.. రవీంద్ర జడేజా అరుదైన రికార్డు!

Ravindra Jadeja Record: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 4 వేలకు పైగా పరుగులు, 350 వికెట్లు పడగొట్టిన నాలుగో ప్లేయర్‌గా జడ్డు రికార్డుల్లో నిలిచాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేశర నువాంతను ఔట్ చేసి ఈ ఘనత అందుకున్నాడు. ఈ టెస్టుకు ముందు జడేజా 89 టెస్టుల్లో 4,095 పరుగులు.. 348 వికెట్లతో ఉన్నాడు. 350 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి అతడికి మరో రెండు వికెట్లు అవసరమయ్యాయి. శ్రీలంక బ్యాటర్ కేశర నువాంతను ఔట్ చేయడంతో జడేజా 350వ టెస్టు వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

రవీంద్ర జడేజా వేసిన బంతిని నువాంత బరి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్‌ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో నువాంత రెండు పరుగులకే పెవిలియన్ చేరగా.. జడేజా 350వ టెస్టు వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 4,000కు పైగా పరుగులు, కనీసం 350 వికెట్లు సాధించిన ఆటగాళ్లు ఇప్పటివరకు ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు జడేజా కూడా ఈ ఎలైట్ జాబితాలో చేరాడు. ఇంగ్లాండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా జడేజా నిలిచాడు.

ఈ జాబితాలో కపిల్ దేవ్ 5,248 పరుగులు, 434 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇయాన్ బోథమ్ 5,200 పరుగులు, 383 వికెట్లు సాధించాడు. డేనియల్ వెట్టోరి 4,531 పరుగులు, 362 వికెట్లతో ఉన్నాడు. రవీంద్ర జడేజా తాజాగా 4,095 పరుగులు, 350 వికెట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ అరుదైన డబుల్‌ను జడేజా వేగంగా అందుకున్నాడు. అతడు 90 టెస్టుల్లోనే 4,000 పరుగులు, 350 వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. ఇయాన్ బోథమ్ మాత్రమే జడేజా కంటే ముందున్నాడు. బోథమ్ 83 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించగా.. కపిల్ దేవ్‌కు 100 టెస్టులు, వెట్టోరికి 106 టెస్టులు పట్టాయి.

రవీద్ర జడేజా 350 టెస్టు వికెట్ల మైలురాయిని అందుకున్న ఐదో భారత బౌలర్‌గా కూడా మరో రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 537 వికెట్లు, కపిల్ దేవ్ 434 వికెట్లు, హర్భజన్ సింగ్ 417 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు జడేజా దిగ్గజాల సరసన చేరాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలోనూ జడేజా మూడో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక దిగ్గజం రంగనా హెరాత్ 433 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. డేనియల్ వెట్టోరి 362 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా 350 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్‌లో కీలక పరుగులు చేయడంతో పాటు బంతితో వికెట్లు తీస్తూ ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు జడేజా విజయాలు అందిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా టెస్టు క్రికెట్‌లో జడ్డు తనదైన ముద్ర వేశాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story