ముంబై, చెన్నై కాదు.. నంబర్-1 ఫ్రాంచైజీగా ఆర్సీబీ.. తొలి క్రికెట్ జట్టుగా అరుదైన చరిత్ర!

RCB: RCB Becomes Most Valuable IPL Franchise in 2026. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా ఐపీఎల్ తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంది.

Rishvik
Published on: 29 July 2026 6:27 PM IST
RCB
X

ముంబై, చెన్నై కాదు.. నంబర్-1 ఫ్రాంచైజీగా ఆర్సీబీ.. తొలి క్రికెట్ జట్టుగా అరుదైన చరిత్ర!

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ తన '2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ అధ్యయనం'ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఐపీఎల్ మొత్తం వ్యాపార విలువ ఏడాది వ్యవధిలో 11.4 శాతం పెరిగి.. 20.6 బిలియన్ డాలర్లకు (రూ. 1,97,024.68 కోట్లు) చేరుకుంది. అలాగే లీగ్ బ్రాండ్ విలువ 10.3 శాతం వృద్ధితో 4.3 బిలియన్ డాలర్లకు (రూ. 41,106 కోట్లు) పెరిగింది. 2023తో పోలిస్తే ఐపీఎల్ బ్రాండ్ విలువ 1.1 బిలియన్ డాలర్లకు పైగా పెరగడం విశేషం.

ఇక్కడ అత్యంత ఆసక్తికర అంశం ఏంటంటే.. ఐపీఎల్ ఫ్రాంచైజీల బ్రాండ్ ర్యాంకింగ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది. ఆర్సీబీ బ్రాండ్ విలువ 312 మిలియన్ డాలర్లకు చేరి.. 300 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. గత ఏడాది 269 మిలియన్ డాలర్లుగా ఉన్న విలువ ఈసారి 16 శాతం పెరిగింది. మైదానంలో విజయాలతో పాటు అభిమానుల మద్దతు, డిజిటల్ ఎంగేజ్‌మెంట్, బలమైన వాణిజ్య ఒప్పందాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా సదరు నివేదిక పేర్కొంది. ఆర్సీబీని ఒక కన్సార్టియం రికార్డు స్థాయిలో 1.78 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ నిలిచింది. ఐపీఎల్ 2026లో నిరాశపరిచినా.. ఐదు టైటిళ్ల చరిత్ర, బలమైన బ్రాండ్ ఇమేజ్, దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యాల కారణంగా 264 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను నమోదు చేసింది. మూడో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 245 మిలియన్ డాలర్ల విలువతో నిలిచింది. 2024 ఐపీఎల్ టైటిల్ ప్రభావం, బలమైన డిజిటల్ ఫాలోయింగ్, వినోదాత్మక బ్రాండ్ ఇమేజ్ కేకేఆర్ వృద్ధికి తోడ్పడ్డాయి. ఎప్పటినుంచో ఐపీఎల్‌లో అత్యంత బలమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి నాలుగో స్థానానికి పరిమితమైంది. సీఎస్‌కే బ్రాండ్ విలువ 244 మిలియన్ డాలర్లకు చేరినా.. వరుసగా రెండో సీజన్‌లో పేలవ ప్రదర్శన, ఎంఎస్ ధోనీ మైదానంలోకి దిగకపోవడంతో వాణిజ్య వృద్ధి మందగించిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 168 మిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచింది. వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం, పెరుగుతున్న వాణిజ్య అవకాశాలు ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసివచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ 161 మిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో నిలవగా.. ప్లేఆఫ్స్ ప్రదర్శనతో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాక జట్టు బ్రాండ్ విలువను మరింత పెంచింది. పంజాబ్ కింగ్స్ 158 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో నిలవగా.. గుజరాత్ టైటాన్స్ 157 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 156 మిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ 122 మిలియన్ డాలర్లతో పదో స్థానంలో నిలిచింది.

2026 సీజన్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాల్లో కూడా చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్సీబీని బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లతో కూడిన కన్సార్టియం 1.78 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా.. రాజస్థాన్ రాయల్స్‌ను మిట్టల్ కుటుంబం, అదార్ పూనావాలా 1.65 బిలియన్ డాలర్ల విలువతో సొంతం చేసుకున్నారు. ఈ భారీ ఒప్పందాలు ఐపీఎల్ భవిష్యత్ వాణిజ్య సామర్థ్యంపై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పాయని హౌలిహాన్ లోకీ నివేదిక స్పష్టం చేసింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story