RCB vs PBKS: ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమితో మూల్యం చెల్లించుకున్న పంజాబ్!
RCB Enter IPL 2026 Playoffs. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక విజయాన్ని నమోదు చేసింది.
RCB vs PBKS: ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమితో మూల్యం చెల్లించుకున్న పంజాబ్!
RCB vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని నమోదు చేసింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా.. పంజాబ్ కింగ్స్ వరుసగా ఆరో ఓటమిని చవిచూసి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇక మిగిలిన మ్యాచ్‌లో విజయం సాధించినా.. పీబీకేఎస్ పాయింట్లు 15 మాత్రమే అవుతాయి. ఇతర జట్ల ఫలితాలపై పంజాబ్ ఆధారపడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు మార్గం మరింత సులువైంది.
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. శశాంక్ సింగ్ (56) హాఫ్ సెంచరీ చేయగా.. మార్కస్ స్టాయినిస్ (37), కూపర్ కనోలి (37), సూర్యాంశ్ షెడ్జ్ (35) రన్స్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సలామ్ దార్ 3, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రొమారియో షెఫర్డ్ తలో వికెట్ తీశారు. కింగ్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (0), ప్రభ్సిమ్రాన్ సింగ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఒక పరుగే చేసి నిరాశపరిచాడు. దీంతో పంజాబ్ పవర్‌ప్లేలోనే ఒత్తిడిలో పడిపోయింది.
ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్లో శశాంక్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు. కేవలం 27 బంతుల్లోనే 56 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో శశాంక్ చెలరేగినా.. అవసరమైన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో పంజాబ్ లక్ష్యానికి చేరుకోలేకపోయింది. దార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు నమోదు చేసింది. జాకబ్ బెతెల్ (11) త్వరగా ఔటైనా.. విరాట్ కోహ్లీ (58) మరోసారి తన క్లాస్ చూపించాడు. దేవ్‌దత్ పడిక్కల్ (45) వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అనంతరం వెంకటేశ్ అయ్యర్ అసలైన విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 28 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్స్ తీశాడు.




