IPL 2026 : సాయి సుదర్శన్ సెంచరీ వృధా.. గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
IPL 2026 : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఘనవిజయం అందుకుంది. విరాట్ కోహ్లీ (81), పడిక్కల్ (55) మెరుపు ఇన్నింగ్స్‌లతో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించింది.
RCB vs GT
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఆర్సీబీ మట్టికరిపించింది. 200 పైచిలుకు భారీ లక్ష్యాన్ని ఛేదించడమంటే ఒకప్పుడు కష్టంగా అనిపించేది, కానీ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ బ్యాట్ పడితే ఎంతటి స్కోరైనా చిన్నది కావాల్సిందే అని నిరూపించారు. సాయి సుదర్శన్ వీరోచిత సెంచరీ వృధా కాగా, ఆర్సీబీ అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 58 బంతుల్లో 100 పరుగులు చేసి ఐపీఎల్‌లో తన మూడవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చివర్లో గుజరాత్ బ్యాటర్లు వేగంగా ఆడటంతో స్కోరు 200 దాటింది.
206 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే చిన్న ఎదురుదెబ్బ తగిలింది. జాకబ్ బెథెల్ (14) త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే, మ్యాచ్ ప్రారంభంలోనే విరాట్ కోహ్లీకి గుజరాత్ ఫీల్డర్లు ఈజీ క్యాచ్ వదిలేసి పెద్ద తప్పు చేశారు. ఆ లైఫ్ లైన్ ఉపయోగించుకున్న కోహ్లీ, దేవదత్ పడిక్కల్‌తో కలిసి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కేవలం 26 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, 9 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 దాటించారు.
ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ సిక్సర్లతో హోరెత్తించాడు. కేవలం 20 బంతుల్లోనే 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, 55 పరుగులు సాధించాడు. మరోవైపు కింగ్ కోహ్లీ 44 బంతుల్లో 81 పరుగులు (8 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. వీరిద్దరూ 47 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేశారు. కోహ్లీ సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశించినా, 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో ఆర్సీబీ బ్యాటర్లు సంయమనంతో ఆడి 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు.
ఈ అద్భుత విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ పరంగా రాజస్థాన్ రాయల్స్‌ను వెనక్కి నెట్టి ఆర్సీబీ టాప్ పొజిషన్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో కొన్ని తప్పులు చేసినా, కోహ్లీ-పడిక్కల్ మెరుపులు ఆర్సీబీ అభిమానులకు కావాల్సిన అసలైన కిక్ ఇచ్చాయి.




