IPL 2026 : ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్‌పై బీసీసీఐ వేటు.. గెలిచిన ఆనందం ముగియకముందే షాక్

IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్‌లో అంపైర్‌పై ఐస్ బ్యాగ్ విసిరినందుకు ఆర్‌సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అలాగే 50 శాతం మ్యాచ్ ఫీజును కోత పెట్టింది.

CR Reddy
Published on: 2 Jun 2026 6:34 AM IST
Tim David
X

 Tim David

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్‌సీబీ ఆటగాళ్లు, అభిమానులు పండగ చేసుకుంటున్న వేళ.. ఒకే ఒక్క రోజులోనే ఆ జట్టుకు ఊహించని పెద్ద షాక్ తగిలింది. మైదానంలో నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఆర్‌సీబీ స్టార్ హిట్టర్ టిమ్ డేవిడ్ పై బీసీసీఐ నిషేధం విధించింది. అతని మ్యాచ్ ఫీజులో సగం కోత విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా సస్పెండ్ చేసింది.

ఐపీఎల్ ఫైనల్ ముగిసిన మరుసటి రోజు అంటే జూన్ 1, సోమవారం నాడు బీసీసీఐ ఒక అధికారిక ప్రెస్ రిలీజ్ ద్వారా టిమ్ డేవిడ్‌కు విధించిన శిక్ష వివరాలను వెల్లడించింది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఆర్‌సీబీ ఫీల్డింగ్ చేస్తోంది. ఆ సమయంలో గుజరాత్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఒక వికెట్ పడగానే.. టిమ్ డేవిడ్ తీవ్ర ఆగ్రహంతో, మైదానంలో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్‌ను విసిరాడు. ఈ ప్రవర్తన మైదానంలోని కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది.

టిమ్ డేవిడ్ చేసిన ఈ నిర్వాకం ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.9 కింద తీవ్రమైన ఉల్లంఘనగా బీసీసీఐ తేల్చింది. ఈ నిబంధన ప్రకారం మైదానంలో ఉన్న ఏ ఒక్క ఆటగాడు కూడా బంతిని లేదా ఏ ఇతర వస్తువులను ఆటగాళ్లపైకి కానీ, అంపైర్ల పైకి కానీ విసరకూడదు. దీనివల్ల డేవిడ్‌ను లెవెల్-1 కింద దోషిగా గుర్తిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని జరిమానాగా విధించారు. అంతేకాకుండా అతని ఖాతాలో 2 డిమెరిట్ పాయింట్లను కూడా చేర్చారు. మ్యాచ్ రెఫరీ ముందు టిమ్ డేవిడ్ కూడా తన తప్పును అంగీకరించి ఈ శిక్షను స్వీకరించాడు.

టిమ్ డేవిడ్‌పై కేవలం జరిమానాతోనే కాకుండా ఒక మ్యాచ్ నిషేధం పడటానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ 2026 ఐపీఎల్ సీజన్ మొత్తంలో అతను ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడటం ఇది మూడోసారి. ఈ సీజన్ 20వ మ్యాచ్‌లో చేసిన మొదటి తప్పుకు అతనికి 1 డిమెరిట్ పాయింట్ ఇచ్చారు. ఆ తర్వాత 54వ మ్యాచ్‌లో చేసిన రెండో తప్పుకు మరో 2 పాయింట్లు పడ్డాయి. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో చేసిన మూడో తప్పుతో కలిపి అతని ఖాతాలో మొత్తం 5 డిమెరిట్ పాయింట్లు చేరాయి. నిబంధనల ప్రకారం 5 పాయింట్లు దాటడంతో అతనిపై ఆటోమేటిక్‌గా ఒక మ్యాచ్ నిషేధం పడింది.

ఐపీఎల్ 2026 సీజన్ అప్పుడే ముగిసిపోవడంతో ఈ నిషేధం వచ్చే ఏడాది అంటే ఐపీఎల్ 2027 సీజన్‌పై పడనుంది. వచ్చే ఏడాది టిమ్ డేవిడ్ బెంగళూరు తరఫున ఆడినా లేదా మెగా వేలంలో వేరే ఏ జట్టుకు మారినా సరే.. ఆ సీజన్ లోని మొదటి మ్యాచ్‌కు అతను దూరం కావాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒక సీజన్ ముగిశాక వచ్చే సీజన్ మొదటి మ్యాచ్‌కు నిషేధం ఎదుర్కొంటున్న రెండవ ఆటగాడిగా టిమ్ డేవిడ్ నిలిచాడు.

ఇంతకుముందు ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. అప్పటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించి ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. దాంతో అతను ఆ తర్వాతి సీజన్ అయిన ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున మొదటి మ్యాచ్ ఆడలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో టిమ్ డేవిడ్ వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story