RCB vs GT Playing XI: ఆ హిట్టర్‌కు చోటు కష్టమే.. ఆర్సీబీ vs జీటీ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

RCB vs GT Playing XI: క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి.

Rishvik
Published on: 25 May 2026 8:14 PM IST
RCB vs GT Playing XI
X

RCB vs GT Playing XI: ఆ హిట్టర్‌కు చోటు కష్టమే.. ఆర్సీబీ vs జీటీ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

RCB vs GT Playing XI: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమరానికి రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభిస్తుంది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన ఈ రెండు జట్లు ఇప్పుడు టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. ఆర్సీబీ vs జీటీ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుండో ఓసారి చూద్దాం.

ఆర్సీబీ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 255 పరుగుల భారీ స్కోర్ చేయగా.. బెంగళూరు 200 పరుగులకే పరిమితమైంది. వెంకటేశ్ అయ్యర్ 44 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 56 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశను రెండో స్థానంలో ముగించిన జీటీ.. గత మ్యాచ్‌లో చెన్నైపై 89 పరుగుల భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 84 పరుగులతో మెరిపించగా.. శుభ్‌మన్ గిల్ 64, జోస్ బట్లర్ 57 పరుగులతో అదరగొట్టారు. అనంతరం సీఎస్‌కేను 140 పరుగులకే ఆలౌట్ చేశారు. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ 3/26తో చెలరేగాడు.

ఆర్సీబీ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫిల్ సాల్ట్ గాయం నుంచి కోలుకుని తిరిగి తుది జట్టులోకి రావడానికి సిద్ధమయ్యాడు. అయితే అతడిని నేరుగా ఓపెనర్‌గా ఆడిస్తారా? లేక ఇటీవలి మ్యాచ్‌ల్లో మెరిసిన అయ్యర్‌ను కొనసాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడం కలిసొచ్చే అంశం. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా హిట్టింగ్ చేయనున్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ పెద్ద అండ. రసిఖ్ సలామ్, సుయాష్ శర్మలు కూడా రాణిస్తున్నారు.

మరోవైపు గుజరాత్ కూడా పటిష్టంగానే ఉంది. జీటీ తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు దాదాపుగా లేవు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ మంచి ఫామ్ మీదున్నారు. వాషింగ్టన్ సుందర్ జట్టును ఆడుకుంటున్నాడు. దాదాపుగా ఈ నలుగురే మ్యాచును ముగించేస్తునారు. నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్ ఉండనే ఉన్నారు. పేసర్లు కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి స్టార్స్ ఉండగా.. రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఆల్‌రౌండర్‌లుగా సేవలందించనున్నారు.

ధర్మశాల పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఫాస్ట్ బౌలర్లకు ఆరంభంలో స్వింగ్ లభించే అవకాశం ఉన్నా.. తర్వాత బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఎక్కువ. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉండటంతో ఈ పోరు అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్‌గా మారే అవకాశముంది. విరాట్ కోహ్లీ-శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ పోరు, సిరాజ్-హేజిల్‌వుడ్ బౌలింగ్ ద్వంద్వం మ్యాచ్‌కు మరింత హైప్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఫైనల్ బెర్త్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

తుది జట్లు (అంచనా):

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story