RCB vs GT Qualifier-1: బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ అవుట్.. తుది జట్లు ఇవే!

RCB vs GT Qualifier 1 Playing 11. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, జీటీ జట్లు ధర్మశాల వేదికగా మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి.

Rishvik
Published on: 26 May 2026 7:55 PM IST
RCB vs GT Qualifier-1
X

RCB vs GT Qualifier-1: బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ అవుట్.. తుది జట్లు ఇవే!

RCB vs GT Qualifier-1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ధర్మశాల వేదికగా మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.

టాస్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. ధర్మశాల మైదానంలో రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉందని, అందుకే చేజింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ‘ఇది మంచి బ్యాటింగ్ పిచ్‌లా కనిపిస్తోంది. ఈ గ్రౌండ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉంటుంది. కాబట్టి లక్ష్యాన్ని ఛేదించడం సులభమవుతుందని భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని దూరంగా ఉంచి మా సహజ ఆట ఆడాలని చూస్తున్నాం’ అని గిల్ చెప్పాడు. అలాగే జట్టులో ఒక మార్పు చేసినట్లు వెల్లడించాడు. అర్షద్ ఖాన్ స్థానంలో కుల్వంత్‌ ఖేజ్రోలియా తుది జట్టులోకి వచ్చాడు.

టాస్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ... 'పిచ్ చాలా బాగుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. 40 ఓవర్ల పాటు పెద్దగా మార్పులు ఉండవని అంచనా. కాబట్టి మంచి స్కోర్ బోర్డుపై ఉంచి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని చూస్తాం. ఈ సీజన్‌లో మేము మా బలాలపై దృష్టి పెట్టాం. అదే మా విజయ రహస్యం’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ తుది జట్టులో మార్పులు చేయలేదు. గాయం నుంచి కోలుకుని వచ్చిన ఫీల్ సాల్ట్ కు ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. కనీసం ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ జాబితాలో కూడా లేడు. వెంకటేష్ అయ్యర్తో కలిసి కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌లో విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ కీలకంగా మారనున్నారు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. దీంతో క్వాలిఫయర్-1లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మశాల వంటి అందమైన వాతావరణంలో అభిమానులకు మరో క్రికెట్ థ్రిల్లర్ ఖాయంగా కనిపిస్తోంది.

జట్లు:

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), జోస్ బట్లర్‌ (కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, నిశాంత్‌ సింధు, జాసన్‌ హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌, కుల్వంత్‌ ఖేజ్రోలియా, కగిసో రబాడా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: వెంకటేశ్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లీ, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (కీపర్‌), టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, జాకబ్‌ డఫీ, జోష్‌ హేజిల్‌ వుడ్‌, రసిఖ్‌ సలామ్‌ దార్‌.

ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ల జాబితా:

జీటీ: రాహుల్‌ తెవాతియా, గ్లెన్‌ ఫిలిప్స్‌, అనుజ్‌ రావత్‌, కుమార్‌ కుశాగ్ర, సాయి కిశోర్‌.

ఆర్సీబీ: రొమారియో షెఫర్డ్‌, సుయాశ్‌ శర్మ, కాన్షిక్‌ చౌహాన్‌, అభినందన్‌ సింగ్‌, జోర్డాన్‌ కాక్స్‌.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story