RCB vs GT: ఆర్సీబీ, జీటీ క్వాలిఫయర్-1కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?

RCB vs GT Qualifier 1 faces a Rain Threat. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, జీటీ జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి.

Rishvik
Published on: 26 May 2026 2:27 PM IST
RCB vs GT
X

RCB vs GT: ఆర్సీబీ, జీటీ క్వాలిఫయర్-1కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?

RCB vs GT Qualifier 1 Rain Update: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కు వెళ్లేది ఎవరు? అనే ఆసక్తికర చర్చ మొదలైంది.

వాతావరణ నివేదికల ప్రకారం.. ధర్మశాలలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్యువెదర్ అంచనాల ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు నగరంలో 14 నుంచి 25 శాతం వరకు మేఘావృత పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు దాదాపు 80 శాతం వరకు వర్షం పడే అవకాశమున్నట్లు పేర్కొంది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా వర్షం అంతరాయం కలిగిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దైతే.. ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే లీగ్ దశలో ఆర్సీబీ, గుజరాత్ రెండూ 18 పాయింట్లతో సమానంగా నిలిచినా.. మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. అందుకే మ్యాచ్ జరగకపోతే.. లీగ్ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టుకే ప్రయోజనం కలుగుతుంది. అయితే ఐపీఎల్ నిర్వాహకులు మ్యాచ్ నిర్వహించేందుకు అన్ని అవకాశాలు పరిశీలిస్తారు.

వర్షం కారణంగా క్వాలిఫయర్-1 మ్యాచ్ పూర్తిగా నిర్వహించడం సాధ్యం కాకపోతే.. ఓవర్లు కుదిస్తారు. 6 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహిస్తారు. అవసరమైతే కేవలం సూపర్ ఓవర్ ద్వారా కూడా విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి అభిమానులు చివరి వరకు ఉత్కంఠభరిత పరిస్థితులు చూడొచ్చు. ఈ సీజన్‌లో ఆర్సీబీ, జీటీ జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి సమంగా నిలిచాయి. మొత్తం ఐపీఎల్ చరిత్రలో కూడా ఇరు జట్లు 8 సార్లు తలపడగా.. చెరో నాలుగు విజయాలు సాధించాయి. ఆర్సీబీ ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు తెచ్చుకోగా.. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ బలంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్‌పై కన్నేయగా.. గుజరాత్ మరోసారి ట్రోఫీని గెలవాలని పట్టుదలగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story