RCB vs KKR: కేకేఆర్‌పై ఆ స్టార్ ప్లేయర్‌ను ఆడించకండి.. ఆర్సీబీకి జహీర్ సూచన!

RCB vs KKR: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీకి మాజీ భారత పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు.

Rishvik
Published on: 13 May 2026 6:22 PM IST
RCB vs KKR
X

RCB vs KKR: కేకేఆర్‌పై ఆ స్టార్ ప్లేయర్‌ను ఆడించకండి.. ఆర్సీబీకి జహీర్ సూచన!

RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్లేఆఫ్స్ రేసులో ముందు వరసలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 7 విజయాలు అందుకున్న ఆర్సీబీ.. 14 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిస్తే.. టాప్ 2లో ఉండే అవకాశాలు ఉన్నాయి.

బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీకి మాజీ భారత పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. జట్టులో మార్పులు చేయాలని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఒక స్టార్ ప్లేయర్‌ను తప్పించాలని సూచించడం ఇప్పుడు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాయ్‌పూర్ పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్సీబీ అదనపు ఫాస్ట్ బౌలర్‌తో బరిలోకి దిగాలని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఈ పిచ్‌పై అనూహ్య బౌన్స్ ఉండే అవకాశముందని, పేసర్లకు మంచి సహకారం లభిస్తుందని చెప్పాడు. అందుకే జట్టు కాంబినేషన్‌లో మార్పులు అవసరమని సూచించాడు.

‘రాయ్‌పూర్ పిచ్‌ను చూస్తే ఫాస్ట్ బౌలర్లకు సహకారం అందనుంది. అందుకే ఆర్సీబీ ఒక అదనపు పేసర్‌తో ఆడితే బాగుటుంది. భారత పేసర్‌ను తీసుకుంటారా లేదా విదేశీ బౌలర్‌ను ఆడిస్తారా అనేది వారి ఇష్టం. విదేశీ పేసర్‌ను ఎంపిక చేస్తే జట్టు కాంబినేషన్ కొంచెం మారుతుంది. కానీ అది పెద్ద సమస్య కాదు’ అని జహీర్ ఖాన్ క్రిక్‌బజ్‌తో చెప్పాడు.

విదేశీ పేసర్‌ను తీసుకుంటే రొమారియో షెపర్డ్ లేదా జేకబ్ బెతెల్‌లలో ఒకరిని తప్పించాలని జహీర్ ఖాన్ సూచించాడు. ‘జేకబ్ డఫీ లాంటి బౌలర్‌ను తీసుకుంటే ఆర్సీబీ బౌలింగ్ మరింత బలపడుతుంది. అయితే అతడు జట్టులోకి వస్తే రొమారియో షెపర్డ్ లేదా జేకబ్ బెతెల్‌లలో ఒకరు ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నాడు. అంతేకాకుండా స్పిన్నర్ సుయాష్ శర్మ ఫామ్‌పై కూడా జహీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసిన సుయాష్.. ఎకానమీ రేట్ 8.57తో నిరాశపరిచాడు. ‘సుయాష్ శర్మ ఫామ్ కూడా అంత బాగోలేదు. పైగా ఈ పిచ్‌పై అతడికి పెద్దగా సహకారం ఉండకపోవచ్చు. అందుకే అతడిని తప్పించి.. వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకునే మంచి ఫలితం రావొచ్చు’ అని జహీర్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇక ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి విజయం సాధించింది. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో క్రునాల్ పాండ్యా 46 బంతుల్లో 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో ఆర్సీబీ ఒత్తిడిని తట్టుకుని గెలుపొందింది.

మరోవైపు భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు తీసి ముంబైని 166/7 స్కోర్‌కే పరిమితం చేశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా సమిష్టిగా రాణించాలని బెంగళూరు చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ కేకేఆర్‌కు అత్యంత కీలకం. ఇందులో గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story