RCB vs LSG: తడబడిన లక్నో బ్యాటర్లు.. బెంగళూరు ముందు ఈజీ టార్గెట్!
LSG collapse for 146 against RCB in IPL 2026. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో బెంగళూరు ముందు 147 పరుగుల ఈజీ టార్గెట్ ఉంది.
RCB vs LSG IPL 2026
RCB vs LSG IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో బెంగళూరు ముందు 147 పరుగుల ఈజీ టార్గెట్ ఉంది. లక్నో తరఫున ఓపెనర్ మిచెల్ మార్ష్ చేసిన 40 పరుగులే టాప్ స్కోర్. 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 40 రన్స్ చేశాడు. యుష్ బదోని (38; 24 బంతుల్లో), ముకుల్ చౌదరి (39; 28 బంతుల్లో) రాణించారు. బెంగళూరు బౌలర్లలో సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్య 2 వికెట్స్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్ మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరు కలిసి 4 ఓవర్లలో 32 రన్స్ చేశారు. సలామ్ దార్ బౌలింగ్‌లో (3.6) దేవ్‌దత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి మార్‌క్రమ్ (12) అవుట్ అయ్యాడు. కాసేపటికే గాయంతో రిషభ్ పంత్ (1) మైదానంను వీడాడు. నికోలస్ పూరన్ (1) పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సమయంలో మార్ష్, యుష్ బదోని జట్టును ఆదుకున్నారు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో (9.5) మార్ష్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లకు లక్నో స్కోర్ 71/3గా నిలిచింది.
83 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. అబ్దుల్ సమద్ (0) డకౌట్ అయ్యాడు. ముకుల్ చౌదరితో కలిసి యుష్ బదోని లక్నో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఇద్దరు క్రీజులో కుదురుకోవడంతో 15 ఓవర్లకు లక్నో 112 రన్స్ చేసింది. ఈ సమయంలో సలామ్ దార్, భువనేశ్వర్ కుమార్ రెచ్చిపోవడంతో లక్నో వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయింది. జార్జ్ లిండే (7), మహమ్మద్ షమీ (0), అవేశ్ ఖాన్ (1), దిగ్వేష్ సింగ్ రాఠీ (0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. సునాయాస లక్ష్యాన్ని బెంగళూరు ఈజీగా ఛేదించే అవకాశాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు.




