RCB vs MI : ముంబైకి షాక్.. బెంగళూరుకు షేక్.. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీతో ఆర్‌సీబీ టాప్

RCB vs MI : రాయ్‌పూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.

CR Reddy
Published on: 11 May 2026 6:08 AM IST
RCB vs MI
X

RCB vs MI 

RCB vs MI : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. రాయ్‌పూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా, వరుసగా రెండు ఓటముల తర్వాత ఆర్‌సీబీ అద్భుతంగా రీఎంట్రీ ఇచ్చి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

భువనేశ్వర్ ధాటికి ముంబై విలవిల

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ తన మాయాజాలంతో కేవలం 3 ఓవర్లలోనే ముంబై టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. రోహిత్ శర్మ (22), సూర్యకుమార్ యాదవ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే, తిలక్ వర్మ, నమన్ ధీర్ జోడీ 82 పరుగుల విలువైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో ముంబై వెన్ను విరిచాడు.

కుంటుతూనే ఆదుకున్న కృనాల్ పాండ్యా

167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు కథ కూడా ముంబైలాగే మొదలైంది. దీపక్ చాహర్ తన స్పెల్‌తో విరాట్ కోహ్లీని డకౌట్ చేయడంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో కృనాల్ పాండ్యా అసాధారణ పోరాట పటిమను కనబరిచాడు. కాలి గాయంతో ఇబ్బంది పడుతున్నా వెనక్కి తగ్గకుండా కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. జితేష్ శర్మ కూడా కొన్ని కీలక బౌండరీలతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు.

చివరి ఓవర్ డ్రామా.. ఆర్‌సీబీదే పైచేయి

చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. ఉత్కంఠ శిఖరాగ్రానికి చేరిన వేళ, రోమారియో షెపర్డ్ అవుట్ అవ్వడంతో బెంగళూరు శిబిరంలో టెన్షన్ మొదలైంది. కానీ, క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ తొలి బంతికే సిక్సర్ బాది సమీకరణాన్ని మార్చేశాడు. చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన తరుణంలో రసిక్ సలాం రెండు పరుగులు తీసి బెంగళూరుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story