Rishabh Pant: ఇట్స్ అఫీషియల్.. ఐపీఎల్ చరిత్రలో బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్.. పంత్‌కు రూ.12 కోట్లు బొక్క!

Rishabh Pant: Rishabh Pant rejoins Delhi Capitals. ఎల్‌ఎస్‌జీ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ తిరిగి తన సొంత గూటికి వచ్చేశాడు.

Rishvik
Published on: 23 Jun 2026 5:44 PM IST
Rishabh Pant
X

Rishabh Pant: ఇట్స్ అఫీషియల్.. ఐపీఎల్ చరిత్రలో బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్.. పంత్‌కు రూ.12 కోట్లు బొక్క!

Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ తిరిగి తన సొంత గూటికి వచ్చేశాడు. ఐపీఎల్ 2027లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)కు పంత్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని అటు ఐపీఎల్, ఇటు డీసీ అధికారికంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి.

డీసీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లాడు. స్వాప్‌ డీల్‌లో భాగంగా పంత్‌ ఎల్‌ఎస్‌జీ నుంచి బయటికి రాగా.. కుల్దీప్ యాదవ్ ఇన్ అయ్యాడు. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్ అయింది. ఐపీఎల్ వర్గాల్లో ఈ డీల్ భారీ చర్చకు దారితీసింది.

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న పంత్:

2025 మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. దీంతో అతడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే గత రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేదు.

2025 సీజన్‌లో 269 పరుగులు, 2026 సీజన్‌లో 312 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, ఫినిషర్‌గా పలు పాత్రల్లో ఆడినా.. పంత్ తన ధరకు న్యాయం చేయలేకపోయాడు. 2026 సీజన్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న పంత్.. ఇప్పుడు తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.

పంత్‌కు రూ.12 కోట్లు బొక్క:

ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరేందుకు రిషభ్ పంత్‌ భారీ జీతం కోతను కూడా అంగీకరించాడు. ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం.. ఢిల్లీ తరఫున పంత్ ఒక్కో సీజన్‌కు రూ.15 కోట్లు అందుకోనున్నాడు. అంటే లక్నోలో పొందిన జీతంతో పోలిస్తే.. రూ.12 కోట్ల తగ్గింపుతో తన పాత జట్టులోకి తిరిగి అడుగుపెడుతున్నాడు.

2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన పంత్.. దాదాపు ఒక దశాబ్దం పాటు ఆ ఫ్రాంచైజీకి ముఖచిత్రంగా నిలిచాడు. ఢిల్లీ తరఫున 111 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2021 నుంచి 2024 వరకు నాలుగు సీజన్లలో 43 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ అదే జట్టులోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

కుల్దీప్ యాదవ్ ఐదేళ్ల ప్రయాణం:

మరోవైపు కుల్దీప్ యాదవ్ ఐదేళ్ల విజయవంతమైన ప్రయాణం అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌కు వీడ్కోలు పలికాడు. 2022లో ఢిల్లీ జట్టులో చేరిన కుల్దీప్.. 65 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు ప్రధాన వైట్‌బాల్ స్పిన్నర్లలో ఒకడైన కుల్దీప్.. తన ప్రస్తుత విలువ రూ.13.50 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరనున్నాడు. ఈ ట్రేడ్‌పై ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

'ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆటగాళ్ల స్వాప్ ఒప్పందాల్లో ఇది ఒకటి. రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వెళ్తుండగా, కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరనున్నాడు' అని పేర్కొంది. పంత్ తిరిగి ఢిల్లీకి రావడం, కుల్దీప్ లక్నోకు మారడం ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు జట్ల సమీకరణాలు మారనున్నాయి. ఈ ట్రేడ్ ప్రభావం వచ్చే సీజన్‌లో ఎలా ఉంటుందో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story