Riyan Parag: ఏం కొడుతున్నాడు.. వైభవ్ ఎలా ఆడుతున్నాడో అర్థం కావడం లేదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Riyan Parag Hails Vaibhav Sooryavanshi. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
Riyan Parag: ఏం కొడుతున్నాడు.. వైభవ్ ఎలా ఆడుతున్నాడో అర్థం కావడం లేదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Riyan Parag: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) చేతిలో ఓటమిపాలై రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆర్ఆర్ నిర్ధేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని జీటీ18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసక శతకం (104) చేయగా.. సాయి సుదర్శన్ (58) హాఫ్ సెంచరీ బాదాడు. అంతకుముందు రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (96) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై, ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్లో జట్టు సాధించిన విజయాలు, యువ ఆటగాళ్లు చూపిన పోరాట స్ఫూర్తి తనను గర్వపడేలా చేసిందని పేర్కొన్నాడు.
215 పరుగుల స్కోరు పోరాడదగ్గ లక్ష్యమేనని రియాన్ పరాగ్ అభిప్రాయపడ్డాడు. 'ఒక దశలో మేం కనీసం 230కి పైగా పరుగులు చేస్తామనుకున్నాం. మేం 20 పరుగులు తక్కువగా చేశాం. అయినా 215 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవచ్చని భావించాను. మొదటి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు కొంత సహకారం లభించింది. స్లోవర్ బంతులు కూడా బాగా పనిచేశాయి. కానీ రెండో ఇన్నింగ్స్‌లో హెవీ రోలర్ కారణంగా పిచ్ మరింత మెరుగుపడింది. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో అదనంగా 15-20 పరుగులు చాలా తేడా చూపిస్తాయి. గుజరాత్ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయాలంటే ఓపెనర్లను త్వరగా అవుట్ చేయాల్సి ఉండేది. కానీ అది జరగలేదు' అని తెలిపాడు.
ఈ సీజన్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో సానుకూల అంశాలు కనిపిస్తున్నాయని పరాగ్ చెప్పాడు. 'నిజం చెప్పాలంటే ఈ సీజన్ ప్రారంభంలో మేము ప్లేఆఫ్స్‌కు చేరుతామని చాలా మంది అనుకోలేదు. జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వారికి ఐపీఎల్ అనుభవం తక్కువ. కొత్త కాంబినేషన్లు, కొత్త ప్రయోగాలు చేశాం. కానీ ఆటగాళ్లు చూపించిన ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. ఇది చాలా పెద్ద ప్రయాణానికి మంచి ఆరంభం మాత్రమే జట్టు ప్రదర్శనపై నాకు చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొన్నాడు.
వైభవ్ సూర్యవంశీని పరాగ్ ప్రశంసలతో ముంచెత్తాడు. 'వైభవ్ ఏం కొడుతున్నాడు. కొన్ని షాట్స్ చూసి షాక్ అవుతున్నా. నేను మాత్రమే కాదు అందరి పరిస్థితి ఇదే. వైభవ్ బ్యాటింగ్‌ను మాటల్లో చెప్పడం చాలా కష్టం. కొంతమంది బంతిని బలంగా బలంగా కొట్టి పరుగులు చేస్తారు. కానీ వైభవ్ అలా కాదు. అతడు కేవలం స్లాగ్ చేయడం లేదు. పరిస్థితులను అంచనా వేస్తాడు, బౌలర్లను చదువుతాడు, లెక్కలు వేసుకుంటాడు. ఏ పరిస్థితిలో ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. నిజం చెప్పాలంటే.. ఈ వయసులో వైభవ్ ఇవన్నీ ఎలా చేస్తున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
భవిష్యత్తులో వైభవ్ భారత జట్టుకు ఆడాలని, దేశానికి మరిన్ని విజయాలు అందించాలని పరాగ్ ఆకాంక్షించాడు. 'వైభవ్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి దేశానికి మరిన్ని గౌరవాలు తీసుకురావాలి. అలాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా చాలా కాలం ఆడి మాకు రెండో ఐపీఎల్ టైటిల్ అందించాలి' అని రాజస్థాన్ కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ పరాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా భవిష్యత్తులో అతడు భారత క్రికెట్‌కు పెద్ద స్టార్‌గా ఎదుగుతాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.




