Riyan Parag: కోహ్లీ, రోహిత్‌లా సంజు శాంసన్.. రాజస్థాన్ నయా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆర్ఆర్ మాజీ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మారడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం అసాధ్యమని రాజస్థాన్ నయా కెప్టెన్ రియాన్ పరాగ్ స్పష్టం చేశాడు
Riyan Parag: కోహ్లీ, రోహిత్‌లా సంజు శాంసన్.. రాజస్థాన్ నయా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Riyan Parag: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టులో జరిగిన మార్పులపై కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ మాజీ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మారడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం అసాధ్యమని స్పష్టం చేశాడు. సంజు లాంటి ఆటగాడికి ప్రత్యామ్నాయం ఉండదన్నాడు. దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను భర్తీ చేయలేమని.. సంజు కూడా రో-కో మాదిరి ప్రత్యేకం అని పరాగ్ చెప్పుకొచ్చాడు.
ప్రీ-సీజన్ ప్రెస్ మీట్‌లో రియాన్ పరాగ్ మాట్లాడుతూ... 'సంజూ భయ్యా లాంటి ఆటగాడిని మేమెప్పుడూ రీప్లేస్ చేయాలని ఆలోచించలేదు. అతనిలాంటి ఆటగాడు ఒక్కడే ఉంటాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఎలా ప్రత్యామ్నాయం ఉండదో.. సంజుకి అలాగే లేదు. రాజస్థాన్ జట్టులో అతని స్థానాన్ని భర్తీ చేసేలా సమాన నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను వెతకాలి' అని చెప్పాడు. తనపై విశ్వాసం ఉంచిన ఆర్ఆర్ ఫ్రాంచైజీకి పరాగ్ కృతజ్ఞతలు తెలిపాడు. 17 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చిన తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ తనను నమ్మినందుకు రాజస్థాన్ రాయల్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌కు 11 ఏళ్ల పాటు సేవలందిస్తూ.. జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. 2022లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడంతో పాటు 2024లో ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. 10 మ్యాచ్‌లలో ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనను మెరుగుపరచడం తన ప్రధాన లక్ష్యమని పరాగ్ తెలిపాడు. 'గత సీజన్‌లో చివరి ఓవర్లలో ఓడిపోయిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. చిన్న చిన్న తప్పులు చేశాం. ఈసారి మంచి ప్రణాళికతో ఆడితే ఫలితాలు మారుతాయి' అని చెప్పాడు.
ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్, హెడ్ కోచ్ కుమార సంగక్కర కూడా రియాన్ పరాగ్‌ను ప్రశంసించాడు. కెప్టెన్సీ కోసం పలువురు అభ్యర్థులను పరిశీలించామని, కఠినమైన ఇంటర్వ్యూ ప్రక్రియలో పరాగ్ సరైన ఎంపికగా తేలాడని వెల్లడించాడు. పరాగ్‌లో వచ్చిన పరిపక్వత, ఆత్మపరిశీలన తనను ఆకట్టుకున్నాయని సంగక్కర పేర్కొన్నాడు. మొత్తంగా చూస్తే సంజు శాంసన్ వెళ్లిపోవడంతో రాజస్థాన్ జట్టులో కొత్త అధ్యాయం మొదలైంది. పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.




