స్టార్ ప్లేయర్ గాయంతో ఊహించని ఛాన్స్.. అనామకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆర్సీబీ తలరాతను మార్చిన తోపుగాడు
Rajat Patidar RCB Captain: ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో కొన్ని అద్భుతాలు కేవలం కాలమే రాసి పెడుతుంది. గుజరాత్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా అవతరించింది.
స్టార్ ప్లేయర్ గాయంతో ఊహించని ఛాన్స్.. అనామకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆర్సీబీ తలరాతను మార్చిన తోపుగాడు
Rajat Patidar RCB Captain: ఐపీఎల్ 2026 రసవత్తర సమరంలో గుజరాత్‌ను మట్టికరిపించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఒకప్పుడు వేలంలో ఎవరూ పట్టించుకోని ఒక సాదాసీదా ఆటగాడు, గాయపడిన మరో ప్లేయర్ స్థానంలో జట్టులోకి వచ్చి.. నేడు ఆర్సీబీ చరిత్రలోనే అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా ఎదిగిన అద్భుత ప్రయాణం ఇది.
ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో కొన్ని అద్భుతాలు కేవలం కాలమే రాసి పెడుతుంది. గుజరాత్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా అవతరించింది. గతేడాది ట్రోఫీ కరవు తీర్చుకున్న బెంగళూరు, ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడి వరుసగా రెండోసారి దేశీయ క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసించింది.
అయితే ఈ బ్యాక్-టు-బ్యాక్ విజయాల వెనుక కుదరని సమీకరణాలను కుదిర్చిన ఒక ప్రకృతి చమత్కారం ఉందంటే నమ్ముతారా..? ఒకప్పుడు ఆటగాడిగా ఎవరికీ వద్దు అనుకున్న వ్యక్తి, నేడు బెంగళూరు అభిమానుల గుండెల్లో దేవుడిగా కొలువవుతాడని ఎవరూ ఊహించలేదు. ఆయనే ఆర్సీబీ ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్.
వేలంలో తిరస్కరణ.. పెళ్లి వేడుకల నడుమ పిలుపు..
మనం కొద్దిగా వెనక్కి వెళ్తే.. 2022 ఐపీఎల్ వేలంలో రజత్ పాటిదార్‌ను కొనేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. తీవ్ర నిరాశకు గురైన పాటిదార్, ఇక క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలనుకున్నాడు. అదే సమయంలో అతనికి వివాహం కూడా నిశ్చయమైంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న తరుణంలో విధి మరోలా తలచింది.
అప్పట్లో ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ లవ్‌నీత్ సిసోడియా గాయపడటంతో, అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు అప్పటి బెంగళూరు కోచ్ మైక్ హెసన్ పాటిదార్‌ను సంప్రదించాడు. మొదట పెళ్లి కారణంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని భావించినా, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటిదార్ ఆర్సీబీ గూటికి చేరాడు. కేవలం బెంచ్‌కే పరిమితం అవుతాననుకున్న పాటిదార్, అప్పట్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని కేవలం 8 మ్యాచ్‌ల్లోనే ఒక సెంచరీతో సహా 333 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
గాయం చేసిన గాయం.. కసిగా సాగిన పునరాగమనం..
కథ సజావుగా సాగుతుందనుకున్న సమయంలో 2023 సీజన్ పాటిదార్‌కు శాపంగా మారింది. తీవ్రమైన గాయం కారణంగా ఆ ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా దేశీవాళీ క్రికెట్‌లో శ్రమించి భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఆ కసితోనే 2024 ఐపీఎల్ సీజన్లో అడుగుపెట్టి 395 పరుగులతో వీరవిహారం చేశాడు.
ముఖ్యంగా స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ముగ్ధులను చేసింది. అదే సమయంలో ఆర్సీబీ జట్టు ఒక బలమైన నాయకుడి కోసం అన్వేషిస్తోంది. డుప్లెసిస్ నిష్క్రమించడం, విరాట్ కోహ్లీ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకోవడంతో బెంగళూరు యాజమాన్యం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
నాడు అనామకుడు.. నేడు 11 కోట్ల విలువైన ధీరుడు..
పాటిదార్‌పై పూర్తి నమ్మకంతో ఆర్సీబీ ఏకంగా 11 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని జట్టులోనే ఉంచుకుంది. అంతేకాదు, ఎవరూ ఊహించని విధంగా జట్టు నాయకత్వ బాధ్యతలను కూడా అతనికి అప్పగించింది. ఆ నమ్మకాన్ని పాటిదార్ వమ్ము చేయలేదు. 18 ఏళ్లుగా ఆర్సీబీకి దక్కని ఐపీఎల్ కిరీటాన్ని తన మొదటి ఏడాది కెప్టెన్సీలోనే అందించి చరిత్ర సృష్టించాడు.
ఇక ఈ 2026 సీజన్లోనూ సారథిగా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా, కీలక మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో మెప్పించాడు. అతనికి తోడుగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సైతం 600కు పైగా పరుగులతో విరుచుకుపడటంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఒక గాయం కారణంగా జట్టులోకి వచ్చిన సాధారణ ఆటగాడు, ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో ఒక ఛాంపియన్ జట్టును వరుసగా రెండుసార్లు విజేతగా నిలబెట్టడం నిజంగా ప్రకృతి చేసిన వింతే. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే నిరసనలు వ్యక్తమైన చోటే జేజేలు అందుకోవచ్చని రజత్ పాటిదార్ నిరూపించాడు. ఆర్సీబీ అభిమానుల కలల నాయకుడిగా పాటిదార్ ప్రస్థానం రాబోయే తరాలకు ఒక గొప్ప నిదర్శనం.




