Rohit Sharma: కేవలం 109 పరుగులే.. దశాబ్దాల నాటి ‘మహా రికార్డు’పై రోహిత్ కన్ను!

Rohit Sharma: భారత కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు.

Rishvik
Published on: 16 Jun 2026 7:37 PM IST
Rohit Sharma
X

Rohit Sharma: కేవలం 109 పరుగులే.. దశాబ్దాల నాటి ‘మహా రికార్డు’పై రోహిత్ కన్ను!

Rohit Sharma: భారత కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశాన్ని హిట్‌మ్యాన్ అందుకోవడానికి కేవలం ఒక భారీ ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నాడు. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య బుధవారం (జూన్ 17) లక్నోలో జరగనున్న రెండో వన్డేలో 109 పరుగులు చేస్తే.. దశాబ్దాల నాటి ‘మహా రికార్డు' రోహిత్ ఖాతాలో చేరుతుంది.

సెహ్వాగ్ రికార్డుపై రోహిత్ కన్ను:

భారత క్రికెట్ చరిత్రలో డాషింగ్ ఓపెనర్‌గా గుర్తింపు పొందిన వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ తన కెరీర్‌లో ఓపెనర్‌గా 16,119 పరుగులు నమోదు చేశాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం 16,010 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సెహ్వాగ్ రికార్డును అధిగమించాలంటే రోహిత్‌కు ఇంకా 109 పరుగులు అవసరం. లక్నో వేదికగా జరిగే రెండో వన్డేలో ఈ మార్క్‌ను అందుకుంటే.. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనర్‌గా కొత్త చరిత్ర సృష్టిస్తాడు.

తొలి వన్డేలో చేజారిన అవకాశం:

ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ.. ఈ రేర్ రికార్డుకు మరింత చేరువయ్యే అవకాశం రోహిత్ శర్మకు చేజారింది. శుభ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రోహిత్ 16 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అయితే క్రీజులో ఉన్నంతసేపు మంచి టచ్‌లో కనిపించిన హిట్‌మ్యాన్.. లక్నోలో భారీ ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అతని ప్రస్తుత ఫామ్‌ను చూస్తే.. సెహ్వాగ్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ రెండో వన్డేలో మిస్ అయినా.. జూన్ 20న చెన్నైలో జరిగే మూడో వన్డేలో అయినా హిట్‌మ్యాన్ ఈ రికార్డు అందుకోనున్నాడు.

భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు:

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (15335), సునీల్ గవాస్కర్ (12258) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గబ్బర్ శిఖర్ ధావన్ 10,867 పరుగులతో టాప్ 5లో ఉన్నాడు.

సచిన్, గవాస్కర్, ధావన్ వంటి దిగ్గజ ఓపెనర్లను ఇప్పటికే అధిగమించిన రోహిత్.. ఇప్పుడు సెహ్వాగ్ పేరిట ఉన్న రేర్ రికార్డుపై కన్నేశాడు. లక్నో వన్డేలో సెంచరీ సాధిస్తే ఈ ఘనత అతని సొంతం కావచ్చు. భారత్ అభిమానులంతా ఇప్పుడు రోహిత్ బ్యాట్ నుంచి మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి హిట్‌మ్యాన్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story