Prasidh Krishna-Rohit: రోహిత్-ప్రసిద్ధ్‌ జోడీ చరిత్ర.. వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు!

Prasidh Krishna-Rohit: Rohit Sharma and Prasidh Krishna scripted history. మూడో వన్డేలో భారత జట్టు ప్లేయర్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

Rishvik
Updated on: 20 Jun 2026 7:18 PM IST
Prasidh Krishna-Rohit
X

Prasidh Krishna-Rohit: రోహిత్-ప్రసిద్ధ్‌ జోడీ చరిత్ర.. వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు!

Prasidh Krishna-Rohit: అఫ్గానిస్థాన్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు ప్లేయర్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్‌తో అఫ్గానిస్థాన్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్‌లో అసాధారణ మ్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్-ప్రసిద్ధ్ జోడీ భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన ఘనతను అందుకుంది.

మూడో వన్డేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ తన తొలి స్పెల్‌లోనే అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ.. టాప్ ఆర్డర్‌ను కూల్చేశాడు. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా ముగ్గురినీ ఔట్ చేశాడు. ఈ ముగ్గురు ఇచ్చిన క్యాచ్‌లను స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ పట్టాడు. దీంతో ఒకే బౌలర్ బౌలింగ్‌లో ఒకే ఫీల్డర్ మూడు క్యాచ్‌లు పట్టిన మూడో ఘటనగా నిలిచింది. ఇంతకుముందు 2004లో జింబాబ్వేపై ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ మూడు క్యాచ్‌లు పట్టగా.. 2018లో బంగ్లాదేశ్‌పై జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే రోహిత్-ప్రసిద్ధ్ జోడీ రికార్డు మరింత ప్రత్యేకం. వన్డే చరిత్రలో ఒకే బౌలర్-ఫీల్డర్ కలయిక తొలి మూడు వికెట్లను వరుసగా సాధించడం ఇదే తొలిసారి.

అఫ్గానిస్థాన్ 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ జట్టును ఆదుకున్నాడు. అతడు 131 బంతుల్లో 102 పరుగులు చేసి వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (50)తో కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు, మహ్మద్ నబీతో కలిసి ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించి జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించాడు. అయితే చివర్లో మళ్లీ భారత బౌలర్లు పుంజుకోవడంతో అఫ్గానిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. ప్రసిద్ధ్ కృష్ణ 23 పరుగులకే 5 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ఫీట్‌తో జస్ప్రీత్ బుమ్రా, జవగల్ శ్రీనాథ్, మహ్మద్ సిరాజ్ వంటి భారత పేసర్ల ప్రత్యేక జాబితాలో చేరాడు.

మరోవైపు అఫ్గానిస్థాన్ స్కోరుపై ఐదు పెనాల్టీ పరుగుల ప్రభావం కూడా పడింది. 39వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ షాహిదీ పిచ్‌లోని డేంజర్ ఏరియాలో పరుగెత్తడంతో అంపైర్లు భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగులు మంజూరు చేశారు. దీంతో అఫ్గానిస్థాన్ స్కోరు మరింత తగ్గింది. భారత్ ఖాతాలో ఒక్క బంతి కూడా పడకుండానే 5 రన్స్ చేరాయి. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దుమ్ములేపుతోంది. 16 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 123 రన్స్ చేసింది. భారత్ విజయానికి ఇంకా 96 రన్స్ అవసరం. క్రీజులో రోహిత్ శర్మ (52), యశస్వి జైస్వాల్ (58) ఉన్నారు.

ప్రత్యేక రికార్డులు:

# వన్డేల్లో ఒకే బౌలర్ బౌలింగ్‌లో ఒకే ఫీల్డర్ మూడు క్యాచ్‌లు పట్టిన మూడో ఘటన

# తొలి మూడు వికెట్లను వరుసగా ఒకే బౌలర్-ఫీల్డర్ జోడీ సాధించిన తొలి ఘటన

# ప్రసిద్ధ్ కృష్ణ కెరీర్ బెస్ట్ వన్డే గణాంకాలు: 5/23

# హష్మతుల్లా షాహిదీ తొలి వన్డే శతకం: 102 పరుగులు



Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story