Rohit Sharma: గంభీర్‌ను కోచ్‌గా తీసుకొచ్చింది రోహితే.. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసా?

Rohit Sharma requested Gambhir for India's head coach. రోహిత్ శర్మ, గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Rishvik
Published on: 18 July 2026 6:59 PM IST
Rohit Sharma
X

Rohit Sharma: గంభీర్‌ను కోచ్‌గా తీసుకొచ్చింది రోహితే.. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసా?

Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం గత కొంతకాలంగా భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే హిట్‌మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ఊహాగానాలు వస్తున్నాయి. రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల మధ్య మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్ కెరీర్లో చివరి మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ.. గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, రోహిత్ మధ్య సంబంధాలపై కొత్త చర్చ మొదలైంది.

2024 ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ స్వయంగా గౌతమ్ గంభీర్‌ను కలిసి భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాలని కోరినట్లు పీటీఐ తన కథనం పేర్కొంది. అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 'గౌతి భాయ్.. ఇండియన్ టీమ్‌లోకి రండి' అని రోహిత్ చెప్పినట్లు ఆ నివేదిక పేర్కొంది. దీనికి గంభీర్ స్పందిస్తూ .. 'నువ్వు కెప్టెన్‌గా ఉంటే నేను తప్పకుండా వస్తాను' అని బదులిచ్చినట్లు సమాచారం.

గంభీర్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాక ఇద్దరి మధ్య సంబంధాలు క్రమంగా దెబ్బతిన్నట్లు పీటీఐ పేర్కొంది. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ 0-3 తేడాతో టెస్టు సిరీస్ ఓడిపోవడం, అనంతరం 2024-25 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన పరిణామాల తర్వాత గౌతీ, రోహిత్ మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. సిడ్నీ టెస్టుకు ముందు రోహిత్ తన పేలవ ఫామ్ కారణంగా ఆ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని భావించాడట. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అందుకు అంగీకరించలేదని, ఇంగ్లండ్ పర్యటనకు జట్టులో చోటు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని రోహిత్‌కు సూచించినట్లు సమాచారం.

అనంతరం రోహిత్ శర్మ వెంటనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాలని భావించాడు. ఆ సమయంలో బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని. నాకు ఏది మంచిదో నాకు తెలుసు' అని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలతో గంభీర్, అగార్కర్ ఆశ్చర్యానికి గురయ్యారని.. అప్పటి నుంచి అందరి మధ్య సంబంధాలు చెందినట్లు పీటీఐ పేర్కొంది. ఇక లార్డ్స్ మ్యాచ్‌ నేపథ్యంలో అందరి కళ్లు రోహిత్‌ శర్మపైనే ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో 11, 26 స్కోర్లకే వెనుదిరిగిన హిట్‌మ్యాన్.. బ్యాటింగ్‌కు అనుకూలించే లార్డ్స్‌ పిచ్‌పై ఎలా ఆడుతాడో చూడాలి. ఈ మ్యాచులో అయినా చెలరేగి భారత్‌కు విజయాన్ని అందించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story