Rohit Sharma: నా పనే అది, మజా ఉండదు అంటూ.. రిటైర్మెంట్‌ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్!

Rohit Sharma dismissed ODI retirement rumours. తన వన్డే రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తలకు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫుల్‌స్టాప్ పెట్టాడు.

Rishvik
Published on: 20 July 2026 5:40 PM IST
Rohit Sharma
X

Rohit Sharma: నా పనే అది, మజా ఉండదు అంటూ.. రిటైర్మెంట్‌ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్!

Rohit Sharma: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా తన వన్డే రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తలకు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫుల్‌స్టాప్ పెట్టాడు. లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే తర్వాత బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిట్‌మ్యాన్ తన భవిష్యత్తుపై వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం భారత జట్టు విజయంపైనే ఉందని స్పష్టం చేశాడు. భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం, బ్యాట్‌తో పరుగులు చేయడమే తన పని చెప్పాడు. బయటి నుంచి ఎన్నో విమర్శలు, వదంతులు వస్తుంటాయని.. అలాంటివి లేకుంటే మజా ఉండదు అని రోహిత్ చెప్పుకొచ్చాడు. హిట్‌మ్యాన్ తన రిటైర్మెంట్‌ వార్తలకు చెక్ పెట్టడంతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ పరుగులు చేయలేదు. దీంతో లార్డ్స్‌ వన్డే హిట్‌మ్యాన్‌కు చివరిది అని, రోహిత్‌ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. మూడో వన్డేలో హిట్‌మ్యాన్‌ చెలరేగాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. సిరీస్‌ ముగిసిన తర్వాత బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్మెంట్‌ వదంతులకు రోహిత్‌ చెక్‌ పెట్టాడు. 'నా పని బ్యాట్‌తో పరుగులు చేయడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం. నేను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోజు నుంచి నాకు తెలిసింది అదే. అందుకే నేను అదే పని చేస్తూనే ఉంటాను. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచే బయట ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి. నేను ఆడుతున్నంత కాలం అవి కొనసాగుతూనే ఉంటాయి. కానీ అవి నన్ను ఏమాత్రం ప్రభావితం చేయవు. మైదానంలో నేను జట్టు విజయానికి ఎంతగా సహకరిస్తానన్నదే నాకు ముఖ్యం. బయటి విమర్శలు లేకపోతే అసలు ఆటలో మజానే ఉండదు. నా పని మైదానంలో ఉంటుంది.. బయట వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు' అని తెలిపాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ వరుసగా 11, 26 పరుగులే చేయడంతో అతని ఫామ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే తన కెరీర్‌లో చివరి మ్యాచ్ కావచ్చని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా హిట్‌మ్యాన్ అద్భుతంగా చెలరేగాడు. 138 పరుగులు చేసి విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అయితే రోహిత్ పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 360కే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది.

రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న వార్తలపై ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత కూడా రోహిత్ భారత జట్టుకు ఆడతాడని స్పష్టం చేశారు. అలాగే మూడో వన్డే అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 'రోహిత్ భాయ్ తన రిటైర్మెంట్ గురించి మాతో ఎలాంటి చర్చ చేయలేదు. అలాంటి వార్తలు మీడియాలో మాత్రమే వస్తున్నాయి. జట్టులో అలాంటి చర్చే జరగలేదు' అని చెప్పాడు. టీ20, టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు చెప్పిన రోహిత్.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐసీసీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలన్నదే తన లక్ష్యమని, భారతదేశానికి మరో ప్రపంచ కప్ అందించడమే తన కల అని స్పష్టం చేశాడు.

'భారత్‌కు ప్రపంచ కప్ అందించాలని నా కోరిక. చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను చూస్తూ పెరిగాను. అప్పట్లో ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్ లేవు. నాలుగేళ్లకోసారి జరిగే వన్డే ప్రపంచ కప్‌నే క్రికెట్‌లో అత్యున్నత టోర్నీగా భావించేవాళ్లం. ఆ ట్రోఫీని గెలవడానికి నా శక్తి మేరకు కష్టపడతాను' అని రోహిత్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తన మాటలతో పాటు లార్డ్స్‌లో సాధించిన అద్భుత శతకంతో కూడా రోహిత్ గట్టి సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి భారత జట్టుకు విజయాలు అందించడం పైనే ఉందని మరోసారి స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచ కప్ 2027లో రోహిత్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story