Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అవుట్!
Rohit Sharma: స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ముంబై ఇండియన్స్ ఆడే తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం.
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అవుట్!
Rohit Sharma: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ హామ్‌స్ట్రింగ్ (కండరాలు పట్టేయడం) గాయం కారణంగా ముంబై ఆడే తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. గాయం కారణంగా ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో,
ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లకు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై ముంబై మేనేజ్‌మెంట్ నుంచి అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇకపై ఐపీఎల్ 2026లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ గాయంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. హిట్‌మ్యాన్‌కు సంబంధించి ఈరోజు మెడికల్ రిపోర్ట్ వచ్చింది.
స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చీలిక లేదని తేలింది. అయితే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మేనేజ్‌మెంట్ అతడికి రెండు మ్యాచ్‌లలో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్, గుజరాత్ మ్యాచ్‌లకు హిట్‌మ్యాన్ దూరం కానున్నాడని తెలుస్తోంది.
రోహిత్ శర్మ గైర్హాజరీ ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. సగటు 45.67, స్ట్రైక్ రేట్ 165.06తో జట్టుకు కీలకంగా మారాడు. హిట్‌మ్యాన్ గాయం జట్టు బ్యాటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ముంబై ఈ సీజన్‌ను ఆశాజనకంగా ప్రారంభించినా.. తర్వాత వరుసగా మూడు ఓటములు చవిచూసింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు ఇంకా సరైన రిథమ్ అందుకోలేకపోతోంది. సీజన్ ఆరంభంలో కోల్‌కతాపై విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత వరుస ఓటములతో ఒత్తిడిలో పడింది. ఈ సీజన్‌లో ముంబై పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. ఇప్పటికైనా విజయాల బాట పెట్టకుంటే అంతే సంగతులు.
ముంబై జట్టుకు పవర్‌ప్లే పెద్ద సమస్యగా మారింది. బ్యాటింగ్‌లో వేగంగా పరుగులు చేయడంలో విఫలమవుతోంది. రోహిత్ శర్మ కూడా దూరమవుతున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత పెరగవచ్చు. తదుపరి మ్యాచ్‌ల్లో జట్టు కలసి కట్టుగా ఆడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగంలో కూడా ముంబై ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
స్టార్ పేసర్ బుమ్రా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడు పరుగులను కట్టడి చేస్తున్నప్పటికీ వికెట్లు తెయలేకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం పడుతోంది. బౌల్ట్, హార్దిక్ కూడా రాణించడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమన్వయంతో ఆడితేనే ముంబై తిరిగి విజయాల బాట పట్టే అవకాశం ఉంది.




