Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. రోహిత్ శర్మ అవుట్?

Rohit Sharma: ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది.

Rishvik
Published on: 13 April 2026 7:07 PM IST
Rohit Sharma
X

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. రోహిత్ శర్మ అవుట్?

Rohit Sharma: ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగే మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశముంది. త్వరలో హిట్‌మ్యాన్ తొడ కండరాల గాయంకు స్కానింగ్ చేయించుకుంటాడని తెలుస్తోంది. రిపోర్టుల్లో గాయం తీవ్రమైనదని (గ్రేడ్‌-1) తేలితే మాత్రం.. ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు. రోహిత్ గాయంపై ముంబై మేనేజ్‌మెంట్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయపడి మైదానం వీడాల్సి వచ్చింది. 241 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ 5.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. ఆ సమయంలో హిట్‌మ్యాన్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ అందించాడు. ఆపై ఒక బంతిని ఎదుర్కొన్న తర్వాత రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. హిట్‌మ్యాన్ త్వరగా ఔట్ కావడం ముంబై ఇన్నింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. రోహిత్ గాయం కారణంగా ముంబై ఛేజింగ్ మోమెంటమ్ కోల్పోయినట్లు స్పష్టంగా కనిపించింది.

రోహిత్ శర్మ గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రతను అంచనా వేయడానికి స్కాన్లు చేయించనున్నట్లు సమాచారం. ఈ స్కాన్ రిపోర్ట్ ఆధారంగానే హిట్‌మ్యాన్ తదుపరి మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది నిర్ణయించబడుతుంది. ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో ముంబై మ్యాచ్ ఉండగా.. అప్పటికి రోహిత్ ఫిట్‌గా ఉంటాడా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ గ్రేడ్‌-1 గాయం అయితే మాత్రం ముంబైకి భారీ షాక్ తప్పదు.

మ్యాచ్ అనంతరం ముంబై స్టార్ రూథర్‌ఫర్డ్ మాట్లాడుతూ.. 'రోహిత్ శర్మకు హామ్‌స్ట్రింగ్ సమస్య అయి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా చెప్పలేను. ప్ర‌స్తుతం రోహిత్ మా వైద్య‌బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. స్కాన్ రిపోర్ట్‌ల కోసం అందరం వేచి చూస్తున్నాం. రోహిత్ ఫిట్‌నెస్ గురించి త్వరలోనే తెలుస్తుంది' అని చెప్పాడు. రోహిత్‌ త్వరగా కోలుకుని మైదానంలో అడుగుపెట్టాలని ముంబై అభిమానులు ఆశిస్తున్నారు. ఐపీఎల్ 2026లో ముంబై పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే విజయం సాధించింది. ఇప్పటికైనా విజయాల బాట పెట్టకుంటే.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story