Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్.. ఆదివారం చివరి వన్డే?
Rohit Sharma Retirement: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సంచలన వార్తలు వస్తున్నాయి.
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్.. ఆదివారం చివరి వన్డే?
Rohit Sharma: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఒకే ఒక్క చర్చ.. టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్-మ్యాన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు ముగిసిపోయిందా..? ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ వరుస వైఫల్యాలు ఇప్పుడు అతని కెరీర్‌ను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేసాయి. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్‌ను తప్పించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వస్తున్న వార్తలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 19న జరగబోయే మూడో వన్డేనే రోహిత్ శర్మ కెరీర్‌లో ఆఖరి వన్డే కాబోతుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో రోహిత్ బ్యాటింగ్ పూర్తిగా గాడి తప్పింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో కేవలం 11 పరుగులకే పరిమితమైన రోహిత్.. రెండో వన్డేలోనూ 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఈ సిరీస్ మాత్రమే కాదు, గత 8 వన్డే ఇన్నింగ్స్‌లుగా రోహిత్ మార్క్ బ్యాటింగ్ కనిపించడం లేదు.
గత 8 ఇన్నింగ్స్‌లో రోహిత్ చేసింది కేవలం 241 పరుగులు మాత్రమే. ఈ పేలవమైన ఫామ్ సెలెక్టర్ల ఆలోచనలను పూర్తిగా మార్చేసిందని ఇన్సైడ్ టాక్. మరోవైపు, యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ను 2027 ప్రపంచకప్ కోసం ఓపెనర్‌గా సిద్ధం చేయాలని బీసీసీఐ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనే రెండు సెంచరీలు బాదిన జైస్వాల్‌ను నిలకడగా జట్టులో కొనసాగించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ భావిస్తున్నారు.
సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరగబోయే స్వదేశీ వన్డే సిరీస్ నుంచే ఈ కొత్త ప్రణాళికలు పూర్తిగా అమలు కానున్నాయని సమాచారం. విచిత్రమేమిటంటే, విరాట్ కోహ్లీ ఇంకా తమ 2027 వరల్డ్ కప్ ప్లాన్స్‌లో కీలక ఆటగాడిగా కొనసాగుతుండగా, రోహిత్ విషయంలో మాత్రం సెలెక్టర్లు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.
ఇంగ్లాండ్ సిరీస్ నడుస్తున్న తరుణంలోనే, సెలెక్టర్లు రోహిత్ శర్మతో మాట్లాడి 2027 వరల్డ్ కప్ ప్రణాళికల్లో అతను లేడనే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని వన్డేల్లో కొనసాగాలని ఆశపడుతున్నప్పటికీ, భవిష్యత్తు దృష్ట్యా యువ రక్తాన్ని ప్రోత్సహించక తప్పడం లేదని బోర్డు భావిస్తోంది.
బీసీసీఐ సీనియర్ అధికారి మాటల్లో..రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడిని రిటైర్ అవ్వమని ఎవరూ బలవంతం చేయలేరు. కానీ భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. తుది నిర్ణయం పూర్తిగా రోహిత్ శర్మ చేతుల్లోనే ఉందని చెప్పుకొచ్చారు. బీసీసీఐ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ, జూలై 19న జరిగే ఆఖరి వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు క్లైమాక్స్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే రోహిత్ ఆఖరి వన్డే అయితే, హిట్-మ్యాన్ తనదైన శైలిలో భారీ ఇన్నింగ్స్‌తో వీడ్కోలు పలుకుతాడా లేదా అనేది చూడాలి.




