Rohit Sharma-Pakistan XI: షాకింగ్.. పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ!

Rohit Sharma Named Pakistan Test Captain. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్ట్ సారథిగా స్క్రీన్‌పై కనిపించింది.

Rishvik
Published on: 9 May 2026 6:04 PM IST
Rohit Sharma-Pakistan XI
X

Rohit Sharma-Pakistan XI

Rohit Sharma-Pakistan XI: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్ట్ సారథిగా స్క్రీన్‌పై కనిపించడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. హోస్ట్ బ్రాడ్‌కాస్టర్లు చేసిన భారీ పొరపాటు కారణంగా పాక్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు స్క్రీన్‌పై డిస్ప్లే అయింది. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి.

బంగ్లాదేశ్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభ సమయంలో పాక్ టీమ్ గణాంకాలను బ్రాడ్‌కాస్టర్ చూపించింది. అయితే పొరపాటున భారత జట్టు ఆటగాళ్ల పేర్లు స్క్రీన్‌పై ప్రదర్శించింది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అత్యంత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఆ గ్రాఫిక్‌లో పాకిస్థాన్ కెప్టెన్ స్థానంలో రోహిత్ శర్మ పేరును చూపించారు. అంతేకాదు టీమిండియా ప్లేయర్స్ శుభమాన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ పేర్లు కూడా పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించాయి. పొరపాటు గ్రహించిన బ్రాడ్‌కాస్టర్ వెంటనే సరిదిద్దుకుంది. అయితే అప్పటికే ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బ్రాడ్‌కాస్టర్ పొరపాటుపై అభిమానులు, నెటిజెన్స్ ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. 'పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మా?', 'టీమిండియానే మొత్తం పాకిస్థాన్ తరఫున ఆడేస్తోందా?', 'పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్' అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. బ్రాడ్‌కాస్టర్ నిర్లక్ష్యంపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పోయి పోయి పాక్ జట్టులో భారత ఆటగాళ్లను చూపించడం ఏంట్రా అంటూ నవ్వులు పూయిస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు బంగ్లాదేశ్ ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన శాంటో.. ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 129 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 101 పరుగుల వద్ద మొహమ్మద్ అబ్బాస్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మోమినల్ హక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా 4 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసి బలమైన స్థితిలో నిలిచింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story