Rohit Sharma-BCCI: బీసీసీఐతో కీలక భేటీ.. బోర్డు నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి!

Rohit Sharma-BCCI: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

Rishvik
Published on: 17 July 2026 10:33 AM IST
Rohit Sharma-BCCI
X

Rohit Sharma-BCCI: బీసీసీఐతో కీలక భేటీ.. బోర్డు నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి!

Rohit Sharma-BCCI: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ అనంతరం రోహిత్‌ను వన్డే జట్టులో కొనసాగించబోమని భారత క్రికెట్ నియంత్రణ (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ స్పష్టం చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆదివారం (జులై 19న) లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే మ్యాచ్ హిట్‌మ్యాన్ అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో చివరి మ్యాచ్ కావచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే బీసీసీఐ నుంచి ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇంగ్లండ్ పర్యటనలోనే రోహిత్ శర్మ బీసీసీఐ అధికారులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు రోహిత్‌కు తెలియజేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. బీసీసీసీ నిర్ణయంపై రోహిత్ సంతృప్తిగా లేడని కూడా సమాచారం.

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రధానంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాలనే ప్రణాళికలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 ప్రపంచ కప్ నాటికి రోహిత్ వయసు 40 ఏళ్లు దాటుతుండటంతో.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త తరం ఆటగాళ్లను సిద్ధం చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలనేది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయమేనని నివేదికలు పేర్కొన్నాయి. రోహిత్‌ తన భవిష్యత్తుపై తానే నిర్ణయం తీసుకోవాలని, రిటైర్‌ కావాలని అతడికి ఎవరూ చెప్పరని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడట.

టీ20 ప్రపంచ కప్ 2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2025 మే 7న టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. వన్డేల్లో మాత్రం రోహిత్ అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరిగా ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పటివరకు 286 వన్డేల్లో 11,731 పరుగులు చేశాడు. 56 వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ వ్యవహరించాడు. అతడి నాయకత్వంలో భారత్ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.

ప్రస్తుతం రోహిత్ శర్మ వీడ్కోలు వార్తలు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే బీసీసీఐ అధికారికంగా స్పందించే వరకు రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న కథనాలు ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇప్పుడు అందరి దృష్టి లార్డ్స్‌లో జరిగే నిర్ణయాత్మక మూడో వన్డేపైనే ఉంది. అక్కడ హిట్‌మ్యాన్ తన బ్యాట్‌తో విమర్శలకు సమాధానం ఇస్తాడా? లేక నిజంగానే అది అతడి చివరి వన్డే అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story