Mumbai Indians: చివరి వరకు పోరాడుతాం.. ముంబై ఇండియన్స్ అభిమానులకు శుభవార్త!
Rohit Sharma hints at a comeback. ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకున్న సమయంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టు అభిమానులకు ఒక శుభవార్త.
Mumbai Indians
Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కీలక దశకు చేరుకున్న సమయంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టు అభిమానులకు ఒక శుభవార్త. గాయంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నదని తెలుస్తోంది. ఈరోజు రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో రోహిత్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ.. ఫిట్‌నెస్ డ్రిల్స్ చేస్తూ కనిపించాడు. చివరి వరకు పోరాడుతాం (We fight till the end) అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో అభిమానుల్లో ఆశలను పెంచింది.
ఐపీఎల్ 2026లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. తొమ్మిది మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ ఆశలు ఇప్పటికే దాదాపు లేకున్నా.. పట్టికలో మెరుగైన స్థానం కోసం ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. ఈ సమయంలో రోహిత్ శర్మ లాంటి సీనియర్ రాక జట్టుకు పెద్ద బూస్ట్ అవుతుంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి కీలక బ్యాటర్లు ఫామ్‌లో లేకపోవడం జట్టుకు ఇబ్బందిగా మారింది. మరోవైపు బుమ్రా, బౌల్ట్ లాంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నా.. జట్టుకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ చేతేశ్వర్ పూజారా స్పందించాడు. 'ముంబై ఇండియన్స్ పెద్ద జట్టు. అభిమానులు, జట్టు గౌరవం దృష్ట్యా ఎంఐ తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే లక్నో కూడా ఈ సీజన్‌లో సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకే ఈ మ్యాచ్ రెండు జట్లకు గౌరవం కోసం పోరాటంగా మారింది' అని పుజారా అభిప్రాయపడ్డాడు. లక్నో రెండు విజయాలతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. పట్టికలో దిగువన ఉన్న రెండు జట్ల సమరం కాబట్టి.. ఓ టీమ్ ఖాతాలో విజయం చేరడం పక్కా. సొంత మైదానంలో రెచ్చిపోవాలని ముంబై చూస్తోంది.
ముంబై ఇండియన్స్ జట్టులో విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. జట్టు సమష్టిగా రాణించలేకపోతోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, మహ్మద్ షమీ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నా ఫలితం లేదు. మొత్తం మీద ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తే ముంబైకి బలం పెరుగుతుంది. మరోవైపు లక్నో కూడా తమ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు గట్టిగా పోరాడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందించడం ఖాయం.




